ఒంగోలు వన్‌టౌన్: జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పీ రాజాబాబు, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఎలెక్షన్ సెల్ డిప్యూటీ సీఈఓ ఎస్.ఆంజనేయులు, ఒంగోలు డీఆర్‌ఓ చిన ఓబులేసు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సింగరాయకొండ: స్థానిక ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బి.మహేంద్ర శుక్రవారం నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఇతను జిల్లా వాసి కావడంతో స్థానికత కారణంగా పక్క జిల్లాకు బదిలీ అయినట్లు సీఐ సీహెచ్ హజరత్తయ్య తెలిపారు. ఈ స్టేషన్‌కు నూతన ఎస్సై విధులు చేపట్టే వరకు తానే ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
మార్కాపురం: మార్కాపురం సీఐ సుబ్బారావు సెలవుపై వెళ్లారు. అటు నుంచి అటే మార్కాపురం నుంచి బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గురువారం రాత్రి మార్కాపురం పట్టణ ఎస్సై సైదుబాబు రిలీవ్ అయ్యారు. ఇక డీఎస్పీ డాక్టర్ నాగరాజు కూడా వ్యక్తిగత పనిపై తిరుపతి వెళ్లినట్లు తెలిసింది. జిల్లా కేంద్రమైన మార్కాపురంలో డీఎస్పీతో పాటు సీఐ, పట్టణ ఎస్‌ఐ కూడా లేకపోవడంతో పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది.


