ఒంగోలు టౌన్: దేశంలో ఫాసిస్ట్ శక్తులు అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలో ప్రేత సంస్కృతి విచ్చలవిడిగా విస్తరిస్తోందని, దీంతో యువత నిర్వీర్యమవుతోందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.నాగరాజు విచారం వెలిబుచ్చారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయిన యువత సహజ చైతన్యాన్ని కోల్పోయిందని చెప్పారు. అరుణోదయ రాష్ట్ర శిక్షణ తరగతుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూం చర్చి సెంటర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ దేశంలోకి విదేశీ పాశ్చాత్య సంస్కృతి ప్రవేశించడంతో దేశ సంస్కృతిలో భాగమైన సంప్రదాయాలు, సాహిత్యం, జానపద కళారూపాలు, శ్రమజీవుల ఆటపాటలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ సీరియల్స్, సినిమాలు, రియాల్టీ షోలు విద్యార్థులను, యువతను చెడు మార్గం పట్టిస్తున్నాయని చెప్పారు. వీటికి వ్యతిరేకంగా విష సంస్కృతి వలన కలుగుతున్న కష్ట నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీఎస్ సాగర్, అరుణోదయ కళాకారులు జి.శ్రీనివాస్, ఆర్.సుజాత, జయలక్ష్మి, లక్ష్మి కళ, ఆర్.మోహన్, మోజెస్ పాల్గొన్నారు.


