మత్తు విస్తరిస్తూ! | - | Sakshi
Sakshi News home page

మత్తు విస్తరిస్తూ!

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు పొరుగు ప్రాంతాల నుంచి అక్రమ రవాణా జాతీయ రహదారి, రైళ్ల ద్వారా భారీగా తరలింపు గ్రామ స్థాయికి చేరిన అమ్మకాలు కొత్తగా గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు కాలేజీలు, పాఠశాలలే లక్ష్యంగా ముఠాల ఆగడాలు

గంజాయి పల్లెవిస్తూ..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొరుగు ప్రాంతాల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఆనుకుని ఉన్న పలు జాతీయ రహదారుల మీదుగా గంజాయి ఓ ప్రవాహంలా వచ్చిపడుతోంది. పోలీసులకు సమాచారం వచ్చినప్పుడో, లేకపోతే రెగ్యులర్‌ తనిఖీల్లోనో గంజాయి పట్టుకోవడం జరుగుతోంది. దొరికిన వాడు దొంగ.. లేకపోతే దొర అన్నట్లుగా వ్యవహారం సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. మార్చి నెలలో ఒడిశా నుంచి చైన్నెకి కారులో తీసుకెళ్తున్న గంజాయి అనుకోకుండా జరిగిన ప్రమాదంతో పోలీసుల కంట పడింది. చైన్నెకు చెందిన చరణ్‌ అనే వ్యక్తి దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేసే సాయికుమార్‌ తన మిత్రులు జగదీష్‌, సతీష్‌, మరో ఇద్దరు యువకులతో కలిసి ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి చైన్నెలో విక్రయిస్తున్నారు. ఎప్పటిలాగే సతీష్‌ మోటారు బైకు మీద ఒడిశా వెళ్లి గంజాయి తీసుకొస్తుండగా పల్నాడు జిల్లా ఎడ్లపాడు వద్ద బైకు చెడిపోయింది. దీంతో చైన్నె నుంచి కారులో వచ్చిన చరణ్‌, సాయికుమార్‌, జగదీష్‌ గంజాయి తీసుకెళ్తుండగా అతివేగం వలన గుడ్లూరు వద్ద ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు కాస్త దూరంలో పొదల్లో 19 కిలోల గంజాయి దొరికింది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. అలాగే ఈ నెల 15వ తేదీ టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో కారులో తరలిస్తున్న 6.240 కిలోల గంజాయి లభ్యమైంది. జాతీయ రహదారి మీదుగా బస్సులు, కార్లలోనే కాకుండా మోటారు బైకులపై కూడా గంజాయి తరలిస్తున్నట్లు ఈ ఘటనల ద్వారా వెలుగులోకి వచ్చింది. టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద నిత్యం పెద్ద ఎత్తున గంజాయి లభ్యమవుతుండటం గమనార్హం.

రైళ్ల ద్వారా గంజాయి రవాణా...

విశాఖపట్టణం నుంచి ఒంగోలు మీదుగా రాకపోకలు సాగించే రైళ్ల ద్వారా పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరుగుతోంది. ఈగల్‌ టీం, టాస్క్‌ఫోర్స్‌, జీఆర్పీ పోలీసుల బృందం తనిఖీలు చేసినప్పుడల్లా గంజాయి దొరుకుతూనే ఉంది. ఎక్కువగా విద్యార్థులు, యువకులు గంజాయి తరలిస్తూ పట్టుబడుతున్నారు. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ వరకు ప్రత్యేక పోలీసుల బృందం చేసిన తనీఖీలలో భారీగా గంజాయి పట్టుబడినట్లు తెలుస్తోంది. మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. గతేడాది జూలై 7వ తేదీ జరిపిన తనిఖీల్లో వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లో 3,720 కిలోల గంజాయి దొరికింది. ఆగస్టు 8వ తేదీ పూరీ ఎక్స్‌ప్రెస్‌లో 3 కిలోలు, ఆగస్టు 23వ తేదీన పూరీ ఎక్స్‌ప్రెస్‌లో 3.7 కిలోలు, సెప్టెంబర్‌ 5వ తేదీ పూరీ ఎక్స్‌ప్రెస్‌లో 7.600 కిలోలు, సెప్టెంబర్‌ 15వ తేదీ పూరీ ఎక్స్‌ప్రెస్‌లో ఒకరి వద్ద 5.35 కిలోలు, మరొకరి వద్ద 8.15 కిలోల గంజాయి లభ్యమైంది. నాలుగు రోజుల వ్యవధిలో సెప్టెంబర్‌ 19వ తేదీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో 0.855 గ్రాములు, 26వ తేదీ ధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో 9.5 కిలోలు, అక్టోబర్‌ 27వ తేదీ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో 13.8 కిలోలు, నవంబర్‌ 13వ తేదీ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో 3.24 కిలోలు, డిసెంబర్‌ 4వ తేదీ పూరీ ఎక్స్‌ప్రెస్‌లో 6,280 కిలోలు, 12వ తేదీ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో 10.520 కిలోలు, 20వ తేదీ అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌లో 6.774 కిలోలు, 27వ తేదీ అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌లో 11 కిలోల గంజాయిని రైల్వే పోలీసులతో పాటు ఈగల్‌ టీం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 5వ తేదీ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో 10.300 కిలోలు, 31వ తేదీ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో 15 కిలోలు, మార్చి 6వ తేదీ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ఒక కిలో, 25వ తేదీ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2025లో 89.106 కిలోల గంజాయి, 2026 మార్చి వరకు 38.300 కిలోలు కలిపి మొత్తం 127.406 కిలోల గంజాయి పట్టుబడింది. అధికారికంగా పట్టుబడిందే ఇంత ఉంటే.. అనధికారికంగా పెద్ద మొత్తంలో తరలిపోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గతేడాది జిల్లా పోలీసు కార్యాలయం విడుదల చేసిన 2025 క్రైం బులెటిన్‌లో కూడా 85 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందులో రైళ్లలో తనిఖీలు చేసి 49 కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలపడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement