మార్కాపురం రూరల్: మార్కాపురం పరిధిలోని రాయవరం వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం జీజీహెచ్ వద్ద మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో కర్నూలు ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రూ.10 లక్షలు, అమలాపురంలో జరిగిన ఘటనలో రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేసియా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదే విధంగా మార్కాపురంలో జరిగిన ఘటనలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారు ఎక్కువమంది కూలీలు కావడంతో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీల పట్ల ప్రభుత్వం వివక్ష చూపకూడదని కోరారు. ఈయన వెంట ఎమ్మార్పీయస్ నాయకులు సాలెంరాజు, పీటర్ మాదిగ, జయరాజు మాదిగ, రమేష్ మాదిగ తదితరులు ఉన్నారు.


