కొనకనమిట్ల/కంభం: కొనకనమిట్ల మండలం చింతగుంట గ్రామానికి చెందిన వెలుగోటి గురవయ్య (60) ఇటీవల రంజాన్ పండక్కి తన కుమారులు ఉంటున్న హైదరాబాద్‌కు వెళ్లాడు. గురవయ్య, తన కుమారులతో పాటు బంధువులు కొంతమంది గతేడాది గ్రామంలోని రామాలయానికి సంబంధించిన డబ్బులు రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న డబ్బులు శుక్రవారం జరిగే శ్రీరామ నవమికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్‌లో బేల్దారి పని చేస్తున్న తన చిన్న కొడుకు చిన ఖాజావలి దగ్గర నుంచి రూ.5 లక్షలు తీసుకొని బుధవారం రాత్రి హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఎక్కి స్వగ్రామం వస్తున్నాడు. మార్కాపురం మండలం రాయవరం దాటిన తర్వాత గురువారం ఉదయం ఒక్కసారిగా ఘోర ప్రమాదం జరగడంతో రూ.5 లక్షలతో ఉన్న సంచిని బస్సులోనే వదిలేసి ప్రాణభయంతో కిటికీలో నుంచి దూకాడు. నగదు ఉన్న సంచి మంటల్లో కాలిపోయింది.
ఒంగోలు టౌన్: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా కార్యదర్శిగా కంకణాల రమాదేవి ఎంపికయ్యారు. గురువారం ప్రజా సంఘాల కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలిగా నెరుసుల మాలతి, ఉపాధ్యక్షురాలిగా ఎస్‌కే మున్వర్ సుల్తానా, సహాయ కార్యదర్శిగా జి.ఆదిలక్ష్మి, కోశాధికారిగా బి.రాజ్యలక్ష్మితో సహా ఐదుగురు అఫీసు బేరర్లతో మొత్తం 17 మందితో జిల్లా కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేయడం కంటే ముందుగానే డబ్బు ఇవ్వాలన్నారు. మహాశక్తి పథకం ద్వారా 18 నుంచి 56 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు 1500 రుపాయలు ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా దాని గురించి అసలు ప్రస్తావించడం లేదని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 14 రకాల నిత్యావసర వస్తువులను ఇంటి దగ్గరే అందిస్తామని చెప్పారని, అసలుకే ఎసరు పెడుతూ కందిపప్పు, పంచదార ఇవ్వడం మానేశారని దుయ్యబట్టారు. ప్రజలు కోరకుండానే మద్యం పాలసీ తీసుకొచ్చి విచ్చలవిడిగా మద్యం దుకాణాలు తెరిచారని మండిపడ్డారు. జిల్లాలో 183 మద్యం దుకాణాలు ఉండగా వేలాది బెల్ట్ షాపులు 24 గంటలు ప్రజలకు విశేష సేవలందిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మహిళలు, చిన్నారులపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.


