104 ఉద్యోగులపై వేధింపులు ఆపాలి
ఒంగోలు టౌన్: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందిస్తున్న 104 ఉద్యోగులపై భవ్య హెల్త్‌కేర్ సర్వీస్ సంస్థ వేధింపులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం కలెక్టరేట్ ఎదురుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ 104 ఉద్యోగులకు తగ్గించిన వేతనాలను, రద్దు చేసిన క్యాజువల్ సెలవులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల సర్వీసు దాటిన డ్రైవర్లకు స్లాబ్ మార్చి వేతనాలు చెల్లించాలని, డీఈఓలకు ఏపీ ప్రభుత్వ జీవో ప్రకారం 18,500 రూపాయల జీతం చెల్లించాలని కోరారు. 104లో ప్రజలకు అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులపై భవ్య హెల్త్ కేర్ సర్వీస్ సంస్థ యాజమాన్యం వేధింపులకు పాల్పడటం దారుణమని, ఈ వైఖరి మార్చుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రవి వర్మ, డివిజన్ కన్వీనర్ అడక శ్రీకాంత్, వంశీరెడ్డి, కళ్యాణి, దేవ కరుణ, కృప, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
104 ఉద్యోగులపై వేధింపులు ఆపాలి


