విద్యుత్ పొదుపుపై అవగాహన పెంచుకోవాలి
ఒంగోలు సబర్బన్: విద్యుత్ పొదుపు, సమర్థ వినియోగంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచి విద్యుత్ పొదుపు గురించి తెలుసుకుంటే ప్రతి ఇంట్లో విద్యుత్‌ను ఆదా చేయవచ్చని చెప్పారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు కర్నూలు రోడ్డులోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులకు ఇంధన పొదుపుపై వక్తృత్వం, వ్యాసరచన, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు, యువతకు విద్యుత్ పొదుపు గురించి అవగాహన కల్పించాలంటే తొలుత విద్యార్థి దశ నుంచి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడంతో పాటు భద్రంగా వినియోగించాలన్నారు. సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాలన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం గురించి విద్యార్థులు తెలుసుకోవాలని చెప్పారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు జరిగాయన్నారు. వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి కె.మౌనికా దుర్గ, జీఎస్ మానస చందన వైష్ణవి, పి.ఎలియాజర్ దక్కించుకున్నారు. వ్యాసరచన పోటీల్లో డి.హర్షవర్ధన్, జి.షారోన్ హుల్‌దా, ఎస్‌కే ఆసిఫ్ బాషా దక్కించుకున్నారు. డ్రాయింగ్ పోటీల్లో ఎండీ నిస్సార్ అహ్మద్, ఆర్.రేణుక, టి.సృజన దక్కించుకున్నారు. ఎస్‌ఈ కట్టా వేంకటేశ్వర్లు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. టౌన్ డీఈఈ కేవీపీ రంగారావు, ఏఈఈ శివప్రసాద్, స్కూల్ అకాడమి ఇన్‌చార్జి సుభాషిణి, సిబ్బంది పాల్గొన్నారు.


