నాడు–నేడుతో రూపురేఖలు మారిన పాఠశాల
చీమకుర్తి: వైఎస్సార్ సీపీ హయాంలో సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నాడు – నేడు ఫేజ్–1, ఫేజ్–2 పథకంతో చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. రూ.43 లక్షలు ఖర్చుచేసి పాఠశాలకు ఆర్చి నిర్మాణంతో పాటు ప్రతి తరగతి గదిని గ్రానైట్ రాళ్లతో అద్దంలా తీర్చిదిద్దారు. పాఠశాల ఆవరణలో టైల్స్ పరిచారు. నాడు–నేడు నిధులతో పాఠశాల ఎంట్రెన్స్‌లో కార్పెట్ పరిచినట్లు సుందరంగా తీర్చిదిద్దారని ఆ గ్రామానికి చెందిన మనుబ్రోలు ఉమామహేశ్వరరావు, తదితరులు ఎంతో గొప్పగా చెబుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు మించి పాఠశాల తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, పిల్లలను అలరించేలా వేసిన పెయింటింగ్ నేటికీ విద్యార్థులను, గ్రామస్తులను ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. సౌకర్యంగా పాఠాలు బోధించేందుకు నాడు–నేడు పథకం ద్వారా జరిగిన అభివృద్ధి పనులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఉపాధ్యాయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికే తలమానికంగా పాఠశాల ఉందంటూ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఉమా మహేశ్వరరావు తెలిపారు.


