ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఒంగోలు సబర్బన్: ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్ బిరాజ్ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో ఆదివారం ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ బిరాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నికల సమయంలో కూటమిలోని టీడీపీ నాయకులు అనేక హామీలు ఇచ్చారన్నారు. వాటిని నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతోందన్నారు. రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా ఉన్న లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో కాస్మోటిక్ చార్జీల పెంపు, మెనూ చార్జీల పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించటంలాంటి ఎన్నో హామీలు గుప్పించారని గుర్తు చేశారు. వాటిని వెంటనే పెంచాలని, ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయా లలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించాలన్నారు. తద్వారా సమాజానికి సమర్థ నాయకత్వం దొరుకుతుందని వివరించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి గోపి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్, మల్లికార్జున్, జాతీయ కార్యవర్గ సభ్యులు వేదశ్రీ, ఏబీవీపీ నాయకులు సత్యసాయి, మహేష్, జిల్లా కన్వీనర్ గురునాథ్, మీడియా ఇన్‌చార్జ్ రావులపల్లి నాగేంద్ర యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి
ఏబీవీపీ రాష్ట్ర సదస్సులో జాతీయ కార్యదర్శి శ్రావణ్ బిరాజ్ డిమాండ్


