ప్రారంభోత్సవం మళ్లీ..మళ్లీ
న్యూస్‌రీల్
మద్దిపాడు: అదేదో సినిమాలో చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అంటూ పిచ్చి కవిత్వం చెప్పినట్టుగానే ఉంది తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. గత సంవత్సరం మార్చి 3వ తేదీన అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మంత్రి హోదాలో పలు సచివాలయాలను, వెల్ నెస్ సెంటర్లను, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ క్రమంలో 2024 మార్చి మూడో తేదీన ఏడుగుండ్లపాడులో నిర్మించిన సచివాలయం పక్కనే ఉన్న వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. నేడు ఆ శిలాఫలకంపై పేపర్లు అడ్డుగా ఉంచి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే చేత తిరిగి అదే సచివాలయాన్ని ప్రారంభింపజేయడం తెలుగు తమ్ముళ్ల విజ్ఞతను పలువురు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులే.. ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారంటూ మాట్లాడుకోవడం వినిపించింది.
ఒంగోలు టౌన్: ఎట్టకేలకు జీజీహెచ్‌లో ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లను అధికారులు ఖరారు చేశారు. ప్రస్తుతం జీజీహెచ్‌లోని రోగులకు ఆహారం సరఫరా చేస్తున్న డైట్ కాంట్రాక్ట్ గడువు జూలైతో ముగిసింది. వెంటనే మరొకరిని నియమించకుండా పాత కాంట్రాక్టర్‌నే కొనసాగించారు. ఐదు నెలల తర్వాత కొత్త వారిని నియమించాలన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. అందులో భాగంగా డిస్టిక్ట్ డైట్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జేసీ ఆర్.గోపాలకృష్ణ మంగళవారం జరిగిన కమిటీ సమావేశంలో కొత్త కాంట్రాక్టర్ల కోసం లక్కీ డ్రా తీశారు. మొత్తం ఐదుగురు దరఖాస్తు చేసుకోగా లక్కీ డ్రా తీశారు. సుకవాసి శ్రీనివాసరావు, మెస్సెస్ అంజనా ఎంటర్‌ప్రెజెస్, మెస్సెస్ కృష్ణ కనస్ట్రక్షన్స్‌ను ఎంపిక చేశారు. వీరు ముగ్గురు తలా 8 నెలల పాటు రొటేషన్ పద్ధతిలో ఆహారం సరఫరా చేస్తారు.


