అక్రమాల కేటుగాళ్లు..!
పొన్నలూరు: గ్రామాల్లో టీడీపీ నాయకుల అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. ఏకంగా ప్రభుత్వ అధికారుల సంతకం, స్టాంపును ఫోర్జరీ చేసి దొంగ పత్రాలు సృష్టించారు. ఆ దొంగ పత్రాలతో ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. ఈ సంఘటన మండలంలోని కె. అగ్రహారంలో జరిగింది. బాధితురాలి వివరాల మేరకు..గ్రామానికి చెందిన ఎస్‌కే హుస్సేన్‌బీకి సర్వే నంబర్ 447/3ఏ లోని 78 గజాల స్థలంలో సుమారుగా 40 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకోని నివాసం ఉంటుంది. ఈ నివాసానికి సంబంధించిన హక్కు పత్రంతో పాటు విద్యుత్ మీటర్ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అయితే హుస్సేన్‌బీకి ఇద్దరు కుమార్తెలు. వీరిలోని రెండో కుమార్తె తన తల్లి ఇంటిని ఏ విధంగానైనా దక్కించుకోవాలని పథకం రచించింది. దీంతో గ్రామంలోని టీడీపీ సానుభూతిపరుడిని ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలుగు తమ్ముడు స్థానిక వీఆర్వో సంతకం, స్టాంపును ఫోర్జరీ చేసి హుస్సేన్‌బీ ఇంటిని తన రెండవ కుమార్తెది అయినట్లుగా పొజిషన్ సర్టిఫికెట్ తయారు చేశాడు. ఈ ఫోర్జరీ పత్రాన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శికి చూపించి రెండో కుమార్తె పేరుపై ఇంటి పన్ను కూడా కట్టినట్లు రశీదు ఇప్పించాడు. అయితే పొజిషన్ సర్టిఫికెట్‌ను వీఆర్వో 2025 ఏప్రిల్ 3వ తేదీన మంజూరు చేసినట్లు సదరు పత్రంలో ఉండగా, సంబంధిత వీఆర్వో 2024 అక్టోబర్‌లో పొన్నలూరు మండలం నుంచి మరో మండలానికి బదిలీపై వెళ్లడం కొసమెరుపు.
ఫోర్జరీ పత్రంతో దొంగ రిజిస్ట్రేషన్...
హుస్సేన్‌బీ ఇంటిని కాజేయాలని చూసిన రెండో కుమార్తె వెంటనే టీడీపీ సానుభూతిపరుడు ఏర్పాటు చేసిన ఫోర్జరీ పత్రం, ఇంటి పన్నుతో తన తల్లికి ఎలాంటి విషయం తెలియనీయకుండా తన భర్తకి గత అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఈ తతంగాన్ని తెలుసుకున్న హుస్సేన్‌బీ సంబంధిత వీఆర్వోని ప్రశ్నించగా సంబంధిత హక్కు పత్రం తాను మంజూరు చేయలేదని, తన సంతకం, స్టాంపుతో ఫోర్జరీ చేసినట్లు తెలిపాడు.
కలెక్టర్‌కి ఫిర్యాదు..ఫలితం శూన్యం
వాస్తవంగా హుస్సేన్‌బీ తన ఇంటి దొంగ రిజిస్ట్రేషన్‌పై రెండు వారాల క్రితం కలెక్టర్, ఆర్డీఓని కలిసి స్పందనలో హక్కు పత్రాలతో ఫిర్యాదు చేసింది. అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం మరోసారి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందనలో అర్జీ సమర్పించి కలెక్టర్‌కి అందించిన అర్జీ గురించి ప్రశ్నించింది. దీనికి స్పందించిన తహసీల్దార్ కలెక్టరేట్ నుంచి తమకు ఎలాంటి అర్జీ రాలేదని సమాధానం చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. స్థానిక టీడీపీ సానుభూతిపరుడు అధికారాన్ని అడ్డుపెట్టుకోని మంత్రి స్వామితో అధికారులకు చెప్పించి తనకు న్యాయం జరగకుండా చూస్తున్నాడని తహసీల్దార్ కార్యాలయం దగ్గర వాపోయింది.
అధికారం అండగా తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ప్రభుత్వ అధికారి సంతకం, స్టాంప్ ఫోర్జరీ చేసి అక్రమంగా
రిజిస్ట్రేషన్ చేసేశారు. ఫోర్జరీ పత్రాలతో తల్లి ఇంటిని కుమార్తె పేరుపై మార్పు చేశారు. దీనిపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్య తీసుకోలేదంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులే పట్టించుకోకుంటే మేం ఏం చేయాలంటూ బాధితురాలు వాపోతోంది.
కె.అగ్రహారంలో తెలుగు తమ్ముడి నిర్వాకం
వీఆర్వో సంతకం, స్టాంప్ ఫోర్జరీ
ఫోర్జరీ పత్రాలతో తల్లి ఇంటిని కుమార్తె పేరుపై మార్పు
దొంగపత్రం సృష్టించి తల్లి ఇంటిని భర్తకు రిజిస్ట్రేషన్ చేసిన కుమార్తె
న్యాయం చేయాలని కలెక్టర్, ఆర్డీఓకి బాధితురాలి ఫిర్యాదు
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
దొంగ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకోలు
అక్రమాల కేటుగాళ్లు..!
అక్రమాల కేటుగాళ్లు..!
అక్రమాల కేటుగాళ్లు..!


