మద్యాన్ని నిషేధించాలి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హింస పెరిగిపోతోందని, మహిళలపై హింసకు కారణమైన మద్యాన్ని నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. హింసా వ్యతిరేక ప్రచారోద్యమంలో భాగంగా బుధవారం స్థానిక గాంధీనగర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ నవంబర్ 25వ తేదీ అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినోత్సవం నుంచి ఈ నెల 10వ తేదీ మానవ హక్కుల దినోత్సవం వరకు మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఐద్వా ఆధ్యర్యంలో ప్రచారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సమాజంలో కూడా ప్రతిరోజూ ఏదోక చోట ఏదోక రకమైన హింస జరగడం విచారకరమన్నారు. లైంగికత ఆధారంగా జరుగుతున్న హింసను అరికట్టేందుకు సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐద్వా నాయకురాలు బి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు బి.గోవిందమ్మ, ఎస్‌కే నాగూర్‌బీ, కె.రాజేశ్వరి, ఎస్‌డీ అమీరున్నీసా, కె.కోమలి, లక్ష్మి, టి.బాలమ్మ, కోటేశ్వరమ్మ, రమణమ్మ పాల్గొన్నారు.


