రస్తా పోరంబోకు స్థలంలో కందిసాగు
కోసేసిన కంది చెట్లతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న మాజీ సైనికుడు
కంది పంటను కోసేస్తున్న రెవెన్యూ సిబ్బంది
కంభం: తాము సాగుచేసుకుంటున్న కంది పంటను రెవెన్యూ అధికారులు అన్యాయంగా కోసేశారంటూ ఓ మాజీ సైనికుడి కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సైనికుడు హరికిరణ్ మాట్లాడుతూ తాను ఉద్యోగ విరమణ తర్వాత కందులాపురం ఇలాఖాలో హైవే రోడ్డులో స్థలం కొనుక్కుని షెడ్డు వేసుకున్నానని, పక్కనే ఉన్న భూమిలో కంది పంట వేసుకున్నానని తెలిపారు. తాను కంది పంట వేసుకున్న పొలం పోరంబోకు స్థలం అని చెబుతూ రెవెన్యూ అధికారులు బుధవారం కోత దశలో ఉన్న కంది పంటను కోసి పక్కన పడేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ సిబ్బంది కోసిపడేసిన కంది చెట్లతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సదరు పొలం విషయంపై కోర్టులో పిటీషను దాఖలు చేసి ఉన్నానని చెప్పినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోలేదని, అన్యాయంగా కోత దశలో ఉన్న తన పంట మొత్తం నాశనం చేసి తమపైనే కేసు పెట్టారని వాపోయారు. కొత్తగా వేసిన వెంచర్లలో ప్రభుత్వ డొంకరోడ్లను కలిపేసుకుంటున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు తాము వేసుకున్న పంటను నాశనం చేశారని వాపోయారు. ఈ విషయంపై తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ రస్తా పోరంబోకు స్థలాన్ని సదరు మాజీ సైనికుడు ఆక్రమించాడని, ఆ స్థలంలో ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. పలుమార్లు చెప్పినా వినకపోవడంతో బుధవారం చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కోత దశలో ఉన్న పంటను కోసేసిన రెవెన్యూ అధికారులు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన మాజీ సైనికుడి కుటుంబం
రస్తా పోరంబోకు స్థలంలో కందిసాగు


