దొంగతనాలు ఎలా చేయాలో.. యూట్యూబ్ ద్వారా తెలుసుకుని..!
పుల్లలచెరువు: అప్పులు చేసి జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు అన్నదమ్ములు.. చేసిన అప్పులు తీర్చే దారి లేక యూట్యూబ్ ద్వారా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకున్నారు. సుమారు రూ.10 లక్షల విలువైన 10 మోటారు సైకిళ్లు చోరీ చేసి చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యా రు. పుల్లలచెరువు మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసుస్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం డీఎస్సీ నాగరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పుల్లలచెరువు మండలంలోని పాతచెర్వుతండాకు చెందిన ఎం.లక్ష్మానాయక్ గత నెల 29వ తేదీ పుల్లలచెరువు వచ్చి గుంటూరు వెళ్లే క్రమంలో పుల్లలచెరువు బస్టాండ్ సెంటర్‌లో బైక్ ఉంచగా, అదేరోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పుల్లలచెరువు ఎస్సై సంపత్‌కుమార్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ నెల 3వ తేదీ మండలంలోని ముటుకుల వద్ద వినుకొండ మండలంలోని గణేష్‌పాలేనికి చెందిన చొప్పర పు వేణు, చొప్పవరపు సన్నీ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలతో పాటు విచారణ చేయగా వారి వద్ద మోటార్ సైకిళ్లను దొంగిలించే వివిధ పరికరాలు ఉన్నాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన పల్సర్ బండిని స్వాధీనం చేసుకున్నారు. దొంగలుగా నిర్ధారణ చేసుకుని విచారణ చేయగా వారి ఇంటి వద్ద దాచి ఉంచిన వివిధ జిల్లాలకు చెందిన బైకులతో పాటు తెలంగాణకు చెందినవి కలిపి మొత్తం 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.10 లక్షల మేరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ అజయ్‌కుమార్ నేతృత్వంలోని ఎస్‌ఐ సంతప్‌కుమార్, సిబ్బంది అరుణ్‌కుమార్, వీరాంజనేయులు, వేణు, కాశీబాబు, హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణను ఎస్పీ హర్షవర్థన్‌రాజు అభినందించి రివార్డు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. డీఎస్సీ నాగరాజు ప్రత్యేకంగా వారిని అభినందించి రివార్డులు అందజేశారు.
జల్సాల కోసం మోటారు సైకిళ్ల చోరీ
అన్నదమ్ములను అరెస్టు చేసిన పోలీసులు
రూ.10 లక్షల విలువైన మోటారు సైకిళ్లు స్వాధీనం


