కలెక్టర్‌ గారూ.. ఇది తగునా | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ గారూ.. ఇది తగునా

Dec 4 2025 7:38 AM | Updated on Dec 4 2025 7:38 AM

కలెక్టర్‌ గారూ.. ఇది తగునా

కలెక్టర్‌ గారూ.. ఇది తగునా

అధికారుల తీరు బానిసత్వాన్ని తలపిస్తోంది ఎటువంటి అర్హత లేనివారితో సమావేశాలు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం: ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల ప్రాతినిధ్యం లేకుండా ఎటువంటి అర్హతలేని వారితో ఆ కార్యక్రమాలు నిర్వహింపచేస్తున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఆర్‌సీ మీటింగ్‌లలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను కూర్చోపెట్టుకొని నిర్వహించడం సరైన పద్ధతి కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి చర్య అని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిబంధనలు తుంగలో తొక్కి స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం లేకుండా, ఎటువంటి అర్హతలేని వ్యక్తిని వెంటేసుకొని కలెక్టర్‌ పర్యటన సాగడం అత్యంత దుర్మార్గపు చర్య అని, ఇటువంటి పరిస్థితి కలెక్టర్‌కు తెలిసే జరుగుతోందని, ఆయన ప్రోత్సాహంతోనే అధికారులు టీడీపీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఆయన విమర్శించారు. తాజాగా దోర్నాల మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు సరైన సమాచారం అందివ్వకుండా ఆ సమావేశాన్ని మమ అనిపించి వాయిదా వేసిన తీరు అత్యంత దారుణమని, ఇదే పరిస్థితి కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గంలోని అధికారులు టీడీపీ ఇన్‌చార్జికి అన్ని శాఖలకు చెందిన అధికారులు పూజ చేస్తూ వాళ్ల విధులను విస్మరిస్తున్నారని, వారి తీరు చూస్తుంటే బానిసత్వాన్ని తలపిస్తోందని అన్నారు. అధికారాన్ని చూపించి ఎటువంటి హోదాలేని వారి ఆధ్వర్యంలో సభలు నిర్వహించడం అధికారుల అవినీతి బాగోతం కప్పిపుచ్చుకోవటానికేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భూమిలో ఉన్న నీటిపైపులు తొలగించి ఎత్తుకొని వెళ్లినా, ప్రభుత్వ ఉద్యోగి అక్రమంగా ఇసుక రవాణా వ్యాపారం చేస్తున్నా, గ్రామాల్లో తమ ఇష్టానుసారంగా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన వారి పింఛన్లు ఎటువంటి కారణాలు లేకుండా తొలగిస్తున్నారని, రెండేళ్లుగా తాగునీటి తోలకం జరిపిన ట్యాంకర్ల యజమానుల బిల్లులను నిలిపేశారన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఉపాధి కూలీలను నిలువు దోపిడీ చేస్తున్నారని, మొక్కల బిల్లుల కోసం రైతులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేడని, ఎస్సీ హాస్టళ్లలో తాగు నీరు, సరైన భోజన సదుపాయం లేదన్నారు. ఒక వర్గానికి చెందిన వారి హౌసింగ్‌ అర్జీలు నమోదు చేయనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్‌, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్‌, యేర్వ చలమారెడ్డి, పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, ఆయా మండలాల పార్టీ కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకట రమణారెడ్డి, దోమకాలు వెంకటేశ్వర్లు, ఎస్‌.పోలిరెడ్డి, వివిధ విభాగాల నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, కె.ఓబులరెడ్డి, సయ్యద్‌ జబీవుల్లా, జానకిరఘు, వి.వెంకటేశ్వర్లు, గడ్డం సుబ్బయ్య, వై.శ్రీనివాసరెడ్డి, ఎస్‌.సుబ్బారావు, ఎస్‌.రంగబాబు, మోహన్‌దాస్‌, సరళ, శార, పెద్దకాపు వెంకటరెడ్డి, షేక్‌.మహమ్మద్‌ కాశిం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement