బసాపురంలో వైద్య శిబిరం
కొనకనమిట్ల: మండలంలోని మునగపాడు పంచాయతీ బసాపురం గ్రామంలో బుధవారం పారిశుధ్య పనులు చేపట్టారు. ఇటీవల కొన్ని రోజులుగా ప్రజలు మలేరియా జ్వరాలతో బాధపడుతుండగా ఇద్దరు చిన్నారులకు డెంగీ జ్వరం అని నిర్థారణ కావడంతో బసాపురంలో జ్వరాలు శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన మండల అధికారులు, వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎంపీడీఓ ఈశ్వరమ్మ, ఈఓపీఆర్డీ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టి అన్నీ వీధుల్లో బ్లీచింగ్ చల్లించారు. మురికి నీరు నిల్వ ఉన్న చోట ఎబేట్ ద్రావణం పిచికారి చేయించారు. కొనకనమిట్ల ప్రభుత్వ వైద్యులు సురేఖ పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరపీడితులను పరీక్షించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. జ్వరాలు తగ్గుముఖం పట్టే వరకు గ్రామంలో వైద్యసేవలు అందిస్తామని డాక్టర్ సురేఖ అన్నారు. డెంగీ జ్వరాలతో ఒంగోలులో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
బసాపురంలో వైద్య శిబిరం


