సాగర్ కాలువలో బీటెక్ విద్యార్థి గల్లంతు
త్రిపురాంతకం: సాగర్ కాలువలో బీటెక్ చదువుతున్న విద్యార్థి గల్లంతైన సంఘటన బుధవారం జరిగింది. త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన పెద్దపూడి సురేంద్రరెడ్డి సాగర్ కాలువ వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడినట్లు తెలిసింది. గ్రామస్తులు, బంధువులు వెతికినా అతని ఆచూకీ లభించలేదు. సురేంద్రరెడ్డి గుంటూరులో బీటెక్ చదువుతున్నాడు. బంధువులు ఇరుముడి కట్టుకుని శబరిమల వెళ్తుండటంతో స్వగ్రామం వచ్చాడు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బంధువర్గం వెతకగా ఉదయం కాలువకు వెళ్లినట్లు సమాచారం అందడంతో కాలువ కట్టపై గాలించారు. అక్కడ బైక్, పాదరక్షలు ఉండటంతో గ్రామస్తులు సురేంద్రరెడ్డి ఆచూకీ కోసం కాలువలో వెతికినా ఫలితం లేకుండాపోయింది. పెద్దపూడి సుబ్బారెడ్డికి కుమారుడు సురేంద్రరెడ్డితో పాటు మరో కుమారుడు ఉన్నాడు. సురేంద్రరెడ్డి ఆచూకీ లభించకపోవడంతో బంధువర్గంలో ఆందోళన నెలకొంది. దీంతో త్రిపురాంతకం తహసీల్దార్ కృష్ణమోహన్, ఎస్‌ఐ శివబసవరాజుకు సమాచారం అందించారు.
త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద ఘటన
గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు
సాగర్ కాలువలో బీటెక్ విద్యార్థి గల్లంతు


