పాస్టర్ హత్య కేసులో 12 మంది అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్
కనిగిరి రూరల్: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాచవరం గ్రామంలో పాస్టర్ ఉడుముల ప్రకాష్ ను హత్య చేసిన కేసులో 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ బుధవారం తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. మాచవరం గ్రామం సుందరయ్యకాలనీ, కనిగిరి పట్టణానికి చెందిన ఏ–1 చీమలదిన్నె వెంగయ్య, ఏ–2 తాళ్లపల్లి కొండమ్మ, ఏ–3 తాళ్లపల్లి బాలవెంగయ్య, ఏ–4 తాళ్లపల్లి వెంగళరావు, ఏ–5 చీమలదిన్నె వంశీ, ఏ–6 చీమలదిన్నె గురవమ్మ, ఏ–7 పిక్కిలి మధు, ఏ–8 తాళ్లపల్లి గురుబాబు, ఏ–9 తాళ్లపల్లి మాలకొండయ్య, ఏ–10 పొలిచెర్ల చెన్నకేశవులు, ఏ–11 కోడూరి లక్ష్మీప్రసన్న, ఏ–12 ఉర్లగంటి పిచ్చయ్యను అరెస్టు చేసినట్లు వివరించారు. కేసు వివరాల ప్రకారం.. మృతుడు ఉడుముల ప్రకాష్ మాచవరం గ్రామంలో చర్చి నిర్మించుకుని అదే చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చీమలదిన్నె గురవమ్మతో పాస్టర్‌కు మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో నిందితులు పలు మార్లు పాస్టర్‌తో గొడవపడి బెదిరించారు. వారి బెదిరింపులను మృతుడు లెక్కచేయకుండా గ్రామంలో చర్చి నడుపుతూ ప్రార్థనలు చేస్తున్నాడు. 2025 జూలై నెలాఖరులో మృతుడు ఉడుముల ప్రకాష్‌కు, చీమలదిన్నె గురవమ్మ (ఏ–6)కు మధ్య మనస్పర్థలు వచ్చాయి. వివాహేతర సంబంధం గురించి చీమలదిన్నె గురవమ్మ తన బంధువులు (ఏ–1 నుంచి ఏ–5, ఏ–7, ఏ–9)కు తెలిపింది. వారు పాస్టర్‌పై కక్ష పెంచుకుని చంపాలనే ఉద్దేశంతో గత ఆగస్టు 6వ తేదీ సుమారు 2 గంటల సమయంలో చర్చిలో పడుకుని ఉన్న పాస్టర్‌తో ఏ–1 నుంచి ఏ–9 వరకు నిందితులు ఏ–10, ఏ–12 ప్రోద్భలంతో చర్చిలోకి అక్రమంగా ప్రవేశించి గొడవపడి కులం పేరుతో దూషించారు. ఇష్టానుసారం కాళ్లతో, చేతులతో కొట్టి బురదలో పడేసి వెళ్లిపోయారు. బంధువులకు ఫోన్ చేసి పాస్టర్ బురదలో పడి ఉన్నాడు.. తెచ్చుకోండి అని చెప్పారు. అతని శరీరంపై కనిపించని గాయాలతో పాటు కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి బంధువులు తరలించి చికిత్స చేయించారు. నిందితులకు భయపడి హాస్పిటల్ నుంచి పాస్టర్ పారిపోయి కనిపించకుండా వెళ్లాడు. అక్టోబర్ 11వ తేదీ సుమారు 7 గంటల సమయంలో ఒంగోలులోని సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న పాస్టర్ ప్రకాష్‌ను సమాచారం అందుకున్న అతని బంధువులు ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్ 14వ తేదీ ఉదయం 6.22 గంటలకు ఆయన మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఎస్సై టీ శ్రీరాం, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


