విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
కలెక్టర్ పీ.రాజాబాబు ఘనంగా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం
ఒంగోలు సబర్బన్: జిల్లాలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పీ.రాజబాబు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు కల్పిస్తామన్నారు. వారి కోసం సమగ్ర సంక్షేమ హాస్టల్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కలెక్టరేట్‌లో ఒక లిఫ్టు సౌకర్యం, ప్రత్యేకమైన మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల స్వయం సహాయక సంఘాల బలోపేతం చేయడానికి వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృప స్వచ్ఛంద సంస్థతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డైరెక్టర్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, లోక్‌అదాలత్ జడ్జి ఎస్.కె ఇబ్రహీం షరీఫ్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ అధికారి సువార్త, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


