చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం విధ్వంసం
● మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: చంద్రబాబు రెండేళ్ల పాలనలోనే వ్యవసాయాన్ని విధ్వంసం చేశారని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం తన అనుకూల పచ్చపత్రికలలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి మరీ రైతులకు అండగా ఉన్న ప్రభుత్వమంటూ ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉన్న శనగలను క్వింటా రూ.1,500 చొప్పున కొనుగోలు చేసి 30 క్వింటాళ్లకు రూ.45 వేలను రైతుల బ్యాంకు ఖాతాలకు జగనన్న జమచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీలలో సుమారు 90 వేల టన్నుల శనగలు నిల్వ ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే వాటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బోనస్‌గా క్వింటాకు రూ.1,500 ఇవ్వాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉత్తుత్తి ప్రకటనలు ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని ఆదిమూలపు సురేష్ హితవు పలికారు.


