కొత్త జిల్లాలో ఉచిత వైద్యం కరువు
మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి
కంభం: కొత్తగా ఏర్పడనున్న మార్కాపురం జిల్లాలో పేద ప్రజలకు ఉచిత వైద్యం కరువుకానుందని వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకంభం గ్రామంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం కోసం 14 నెలలు కష్టపడి 50 ఎకరాలు సేకరించి సుమారు రూ.350 కోట్లు వెచ్చించి వైద్యశాల భవన నిర్మాణాలను ప్రారంభించారన్నారు. ఈ కళాశాల పూర్తయితే సుమారు వెయ్యికి పైగా బెడ్లు, వందమంది వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని, అప్పుడు పేద ప్రజలు ధైర్యంగా ఉచిత వైద్యం చేయించుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తుండటంతో అట్టడుగు వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం పూర్తిగా దూరమవుతుందన్నారు. డబ్బు ఖర్చు పెడితే గానీ అక్కడ చూసే పరిస్థితి ఉండదన్నారు. చిన్నపాటి సమస్యలకు, సర్జరీలకు పేద ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. కోటి సంతకాల కార్యక్రమం ద్వారా సంతకాలు సేకరించి రాష్ట్రంలో కోటి కుటుంబాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు సంతకాలు చేసే కార్యక్రమం చేపట్టారు. సమావేశంలో స్టేట్ యూత్‌వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, గ్రామ సర్పంచ్ రసూల్, అడ్డా నాగయ్య, గంటా రాజశేఖర్, ప్రకాశ్ రావు, ఖాసింబాష, జంగం వెంకటేశ్వర్లు, కాకర్ల సుబ్బారావు, పాపారావు, పట్టా రామయ్య, సాల్మన్, పొదిలి ప్రభాకర్, సయ్యద్ ఖాసిం, డిష్ మున్నా, సలీం, పెద్దకోటేశ్వరరావు, మహబూబ్ పీరా, సబ్బసాని సాంబశివారెడ్డి, ఆనంద్, నాగబూషణం, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.


