పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వారానికి రెండు రోజులే టీచర్లు విజిట్ స్థానికంగా ఉండే ఒక ఉపాధ్యాయుడు, విద్యా వలంటీర్‌లే విద్యాబోధన చదువులకు దూరంగా గిరిజన విద్యార్థులు ఆ పాఠశాలలో కనిపించని ప్రభుత్వ మెనూ అర్ధాకలితో అలమటిస్తున్న గిరిజన బాల, బాలికలు టీడీపీ నాయకుడి అండతో వేదంగా మారిన హెచ్‌ఎం మాట
యర్రగొండపాలెం: డీటీడబ్ల్యూ ఆధ్వర్యంలో నడిచే పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు స్థానికంగా ఉండే ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యా వలంటీర్‌లే చదువులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన విద్యార్థులు విద్యకు దూరంగా ఉండటంతోపాటు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజన సదుపాయం కూడా లేకపోవడంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో ఇలా...
గత ప్రభుత్వ కాలంలో ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్స్‌లో ఉపాధ్యాయులు ఉండి సక్రమంగా ఆశ్రమ పాఠశాలను నడిపించేవారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యావ్యవస్థపై ముఖ్యంగా గిరిజన పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించేవారు. ఎప్పుడు తమ పాఠశాలలను విజిట్ చేస్తారన్న భయంతో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించేవారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజన వసతి కల్పించేవారు. గిరిజన విద్యార్థులు కూడా బడికి క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. నాడు–నేడు పథకం కింద పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు.
చంద్రబాబు ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఆశ్రమ పాఠశాలల నిర్వహణ:
చంద్రబాబు ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేకుండా పోవడంతో హెచ్‌ఎంలతోపాటు ఉపాధ్యాయులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. యర్రగొండపాలెం మండలంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గిరిజనగూడెంలో ఉన్న ఆ పాఠశాలలో డీటీడబ్ల్యూ పర్యవేక్షణలో 7వ తరగతి వరకు గిరిజన విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించేందుకు హెచ్‌ఎంతోపాటు ఏడుగురు ఉపాధ్యాయులను నియమించింది. వారిలో ఇటీవల నియమితులైన ముగ్గురు డీఎస్సీ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరితోపాటు ఒకరు విద్యావలంటీర్ గిరిజన పిల్లలకు విద్యాబోధన చేయాలి. ఆ పాఠశాల హెచ్‌ఎం బైస్వామి టీడీపీ నాయకుడి అడుగులకు మడుగులు వత్తుతుండటంతో ఆయన చెప్పిందే ఆ పాఠశాలలో వేదంగా మారింది. ఉపాధ్యాయులు వారానికి రెండు రోజులు (సోమ, మంగళవారాలు) విజిట్ చేసే ఆఫీసర్లుగా వచ్చి, రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్లిపోతారని ఆ గూడెంవాసులు కె.సురేష్ నాయక్, సురేంద్ర నాయక్ తెలిపారు. మిగిలిన రోజుల్లో స్థానికంగా ఉండే ఉపాధ్యాయుడు కుడుముల పోతురాజు, మరో విద్యా వలంటీర్ వెంకటేశ్ 7 తరగతులు తిరిగి చదువులు చెప్తుంటారని వారు తెలిపారు. దీనివలన గిరిజన విద్యార్థులు చదువులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆశ్రమ పాఠశాలకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు ప్రతి నెలా హెచ్‌ఎంకు ఎంతోకొంత ముట్టచెప్తుంటారని వారు ఆరోపించారు.
భోజనంలో పప్పులపొడి చల్లి సర్దేస్తుంటారు
పాలుట్ల ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు భోజన సదుపాయాలు కల్పించడంలేదు. వారు ఇంటి నుంచి కూరలు తెచ్చుకొని భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ రోజులు టిఫన్‌లో పొంగల్, భోజనంలో పప్పుల పొడి చల్లి సర్దేసుకొని పోతుంటారు. నిత్యం స్నాక్స్ కింద ఇచ్చే చిక్కీలు, గుగ్గుళ్లు, అరటిపండ్లు ఆ పాఠశాలలో ఏ మాత్రం కనిపించవని ఆ గూడెం ప్రజలు తెలిపారు. బైస్వామి హెచ్‌ఎం బాధ్యతతోపాటు వార్డెన్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుండటంతో కనీసం పిల్లలు తినే తిండిలో కూడా కోత విధించడం దారుణమని పలువురు ఆరోపిస్తున్నారు. పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న సంఘటనలపై కలెక్టర్, డీటీడబ్ల్యూ, ఎంఈవోలకు విన్నవించుకున్నా వారు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ఆశ్రమ పాఠశాలలో చదువులు సక్రమంగా కొనసాగేలా చూడాలని, హెచ్‌ఎంతోపాటు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆ గూడెంవాసులు కోరుతున్నారు.
అయ్యవార్లొచ్చేది రెండ్రోజులే!
అయ్యవార్లొచ్చేది రెండ్రోజులే!


