లాభాలు తెచ్చే పంటలేవో చంద్రబాబు చెప్పాలి
ఒంగోలు టౌన్: రైతాంగానికి లాభాలు తెచ్చి పెట్టే పంటలేవో, మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న పంటలేవో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. మంగళవారం మల్లయ్యలింగం భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలేవో, వాటికి ప్రభుత్వం ఏ విధంగా గిట్టుబాటు ధరలు ఇస్తుందో, రైతాంగం నుంచి ఎలా సేకరిస్తున్నారో, వారికి నగదు ఎంత చెల్లిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఎన్డీఏ పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేక, ఏ పంటలు వేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల గిట్టుబాటు ధరల గురించి, రైతుల సంక్షేమం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారైనా సమీక్ష నిర్వహించకపోవడం దారుణమన్నారు. జిల్లాలో మిర్చి సాగు చేయడానికి ఎకరాకు రూ.2 లక్షలు ఖర్చు చేశారని, ఇటీవల వచ్చిన వరుస తుపాన్లతో పంట దెబ్బతిందని, నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడం దుర్మార్గమన్నారు. రూ.లక్షల్లో నష్టపోయిన రైతులకు వేలల్లో పరిహారం ప్రకటించడమేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో కొనేవారు లేక 3 క్వింటాళ్ల శనగ కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయని, రెండేళ్లవుతున్నా కూటమి పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెండేళ్ల పంటను కాదని రబీ సీజన్లో పంటను మాత్రమే కొనుగోలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం శనగపై 30 శాతం సుంకం తగ్గించడంతో క్వింటా కాక్ 2 రకం శనగ రూ.10,500 నుంచి రూ.8500 కు తగ్గిపోయిందని తెలిపారు. రైతులకు రూ.40 వేల వరకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. గత ఏడాది పొగాకు కిలో రూ.276 పలికితే ఈ ఏడాది రూ.220 దక్కిందన్నారు. కిలో పొగాకుకు రూ.55 నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ మాయమాటలతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. సమావేశంలో రైతు నాయకులు బీమవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


