 
															కుప్పకూలిన ఎన్‌ఏపీ ట్యాంకు
● తప్పిన పెనుప్రమాదం
కురిచేడు: మండలంలోని బోధనంపాడు గ్రామ ప్రజల దాహార్తి తీర్చే ఎన్‌ఏపీ ఓవర్‌హెడ్ ట్యాంకు బుధవారం అర్ధరాత్రి కూలిపోయింది. ఎన్‌ఏపీ రక్షిత నీటి పథకం ప్రారంభంలో నిర్మించిన ట్యాంకు శిథిలావస్థకు చేరింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలింది. ట్యాంకుకు ఒక వైపు ఆంజనేయస్వామి ఆలయం, మరో వైపు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతోపాటు చిరు వ్యాపారుల బంకులు ఉన్నాయి. శిధిలావస్థలో ఉన్న ట్యాంకును కూల్చివేసేందుకు ఎన్‌ఏపీ అధికారులు గతంలో ప్రయత్నించినా స్థానికులు అంగీకరించలేదు. తాగునీటి ట్యాంకు నిర్మించిన తర్వాతే పాత ట్యాంకును కూల్చివేయాలని తేల్చి చెప్పడంతో అధికారులు మిన్నకుండిపోయారు. అర్ధరాత్రి వేళ జన సంచారం లేనపుడు ట్యాంకు కూలడంతో పెను ప్రమాదం తప్పింది. పగటి వేళ కూలినట్లయితే ప్రాణ నష్టం సంభవించి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాల నిమిత్తం యుద్ధప్రాతిపదికన ట్యాంకు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం శివారులోని నాగులవరం రోడ్డులో షెడ్‌లో ఉన్న 11 గేదెలు భారీ వర్షానికి గుండ్లకమ్మ పొంగి ప్రవహించడంతో రెండు రోజులపాటు అలాగే ఉండిపోయాయి. ఒంగోలు నుంచి వచ్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పది గేదెలను సురక్షితంగా గురువారం ఉదయం ఒడ్డుకు చేర్చారు. అయితే ఒక గెదె మృతి చెందింది. సమాయక చర్యలను స్థానిక పైర్ ఆఫీసర్ రామకృష్ణ, కమిషనర్ నారాయణరావు, తహసీల్దార్ చిరంజీవి పర్యవేక్షించారు.
● కొత్తపట్నం మండలంలో
292.81 హెక్టార్లలో దెబ్బతిన్న చెరువులు
కొత్తపట్నం: మోంథా తుఫాన్ కారణంగా కొత్తపట్నం మండలంలో రొయ్యల చెరువులకు గండ్లు పడటంతోపాటు వరదనీటిలో మునిగాయి. ఈతముక్కల, కొత్తపట్నం, మోటుమాల, రాజుపాలెం, మడనూరు గ్రామాల్లో 292.81 హెక్టార్లలో చెరువులు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. ఉపరితల ఆవర్తనం, వాయుగుండం ప్రభావంతో వారం క్రితం వర్షాలు పడటం, అంతలోనే తుఫాన్ ధాటికి వరద నీరు పోటెత్తడంతో రొయ్యల చెరువులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈతముక్కలలో 15, 18, 20 కౌంట్ రొయ్యలు నీటి పాలయ్యాయి. 20 కౌంట్ టైగర్ రొయ్యలు కేజీ రూ.550 వరకు పలుకుతుంది. పెట్టుబడి మొత్తం తుఫాన్ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయిందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
 
							కుప్పకూలిన ఎన్‌ఏపీ ట్యాంకు
 
							కుప్పకూలిన ఎన్‌ఏపీ ట్యాంకు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
