 
															ప్రజా సమస్యలు గాలికి.. అబ్బాకొడుకులు షికారుకు..
● వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం
పుల్లలచెరువు: తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కుమారుడు మంత్రి లోకేష్ ఇతర దేశాల్లో షికార్లు చేస్తున్నారని యర్రగొండపాలెం శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. గురువారం ఆయన పుల్లలచెరువు మండలంలోని పలు గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో నష్ట పోయిన పంటలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంపై తీవ్ర తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వారం ముందు నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నా ముందుస్తు చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైందని, ముందస్తు ప్రణాళికలేవీ లేకుండా సుమారు మూడేళ్లకు సరిపడా నీటిని వృథాగా సముద్రానికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి, పొగాకు, అరటి, కంది, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైందని, రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే రోజులు మళ్లీ వచ్చాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఉడుముల అరుణ, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీ బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీ ఎల్.రాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రఘు, సర్పంచ్‌లు కోటిరెడ్డి, రవణారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు రవణమ్మ, మాజీ ఎంపీపీ లాజర్, నాయకులు కాశయ్య, రోసిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డి, శంకర్‌రెడ్డి, హనుమంతరావు, దానియేలు, ప్రసాద్, కోటిరెడ్డి, రవి, దానియేలు, శ్రీకాంత్‌రెడ్డి, కోటిరెడ్డి, లక్ష్మానాయక్, వెంకటేశ్వర్లు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సింగరాయకొండ: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో బింగినపల్లి చెరువు ప్రమాదకర స్థితికి చేరుకుందని సింగరాయకొండ వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బింగినపల్లి చెరువు 2వ నెంబరు తూము శిథిలావస్థకు చేరుకోగా రూ.15 లక్షల నిధులు మంజూరయ్యాయని, ఈ ఏడాది మార్చిలో పనులు ప్రారంభించి సుమారు 15 రోజుల్లో ముగించాల్సి ఉండగా ఇప్పటికీ చేపట్టకపోవడం దారుణమన్నారు. చివరికి చెరువు భధ్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. చెరువు కట్టలు బలహీనంగా ఉన్నాయని చెరువు తెగితే బింగినపల్లి గ్రామంతో పాటు ప్రక్కనే ఉన్న పెద్దన్నపాలెం గ్రామం కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని, భారీగా ప్రాణనష్టం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు తూము నిర్మాణంలో కట్ట పటిష్టతకు గ్రావెల్ పోసి హైడ్రాలిక్ మిషన్‌తో కట్టను దిట్టం చేయాల్సి ఉండగా కేవలం మట్టిపోసి కట్ట ఎత్తుపెంచే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
