 
															తుఫాన్‌ను ఎదుర్కోవడంలో విఫలం
● గ్రామాల పరిశీలనలో మాజీ మంత్రి నాగార్జున
నాగులుప్పలపాడు (మద్దిపాడు): మొంథా తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కూటమి సీఎం చంద్రబాబునాయుడు, జిల్లా యంత్రాంగం విఫలమైందని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులకు గురైన మద్దిపాడు మండలంలోని రాచవారిపాలెం గ్రామాన్ని గురువారం నాగార్జున నాయకులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో పేరుకు పోయిన బురద, నీటి దుర్గంధం వలన ప్రజలు పడుతున్న అవస్థలను కాలనీ వాసులు నాగార్జున దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో కురిసిన భారీ వర్షాల వలన ఏర్పడిన వరద మాత్రమే కాకుండా ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు.
ముందస్తు ఆలోచన లేకుండా
నీటి విడుదల దారుణం..
ముందస్తు ఆలోచన లేకుండా నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక అధికారులు ఒక్కసారిగా గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటిని 12 గేట్లు ఎత్తివేయడం దారుణమన్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంత గ్రామాలు బుధవారం అర్ధ్రరాత్రి నుంచి ఇప్పటి వరకు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయన్నారు. ముందస్తుగా ప్రజలకు ఎలాంటి సమాచారం లేకపోవడం, వారిని వరద ప్రవాహం నుంచి తప్పించకుండానే నీటి విడుదల చేస్తే చివరి నిమిషంలో ప్రజలు ఎక్కడికి పరుగులు తీయాలని ప్రశ్నించారు. నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు, చీర్వానుప్పలపాడు, వినోదరాయుని పాలెం గ్రామాలు పూర్తిగా గుండ్లకమ్మ నీటిలో నిండిపోవడమనేది అధికారుల నిర్లక్ష్యమేన్నారు. గతంలో తుఫాను బాధితులను ఆదుకోవడంలో జగన్‌మోహన్ రెడ్డి సఫలమయ్యారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి తుఫాను బాధితుల పట్ల చొరవ తీసుకొని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిశీలనలో మేరుగ వెంట ఎంపీపీ వాకా అరుణ ఎంపీపీ వెంకట్రావు, రాచవారిపాలెం, దొడ్డవరప్పాడు గ్రామాల సర్పంచ్‌లు నాగమల్లేశ్వరి, రాము, అంజయ్య, నాయకులు కంకణాల సురేష్, మహేష్, అన్వేష్, రామాంజనేయులు, శ్రీరామూర్తి, రజనీ, విష్ణురాజు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
