మోంథా వణుకు..
చలి, ఈదురుగాలులతో వర్షం ప్రారంభం నేడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తుపాను ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఎగసిపడుతున్న అలలతో అల్లకల్లోలంగా సముద్రం కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జిల్లాలో 27 పునరావాస కేంద్రాలు: కలెక్టర్ రాజాబాబు పాకల తీరాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్దన్ రాజు
ఒంగోలు సబర్బన్: జిల్లాకు మోంథా తుపాను రెడ్ అలర్ట్ జారీ అయింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. రాత్రంతా కురుస్తూనే ఉంది. మంగళవారం ఉదయానికి తుపాను మరింత బలపడుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ పీ.రాజాబాబు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. వాయుగుండం తీవ్ర తుపానుగా మారి మూడు రోజుల పాటు తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి కష్టాలు కలుగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రం పైకి వేటకు వెళ్లకుండా ఇప్పటికే గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక అధికారులతో గస్తీ కాస్తున్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యాప్తంగా తీసుకున్న ముందస్తు చర్యలను కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు...
జిల్లాలోని ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకునేలా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. అన్నీ శాఖలను సమన్వయం చేసుకుంటూ తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని కంట్రోల్ రూమ్ సిబ్బందిని కలెక్టర్ రాజాబాబు, జేసీ ఆర్ గోపాలకృష్ణ సూచించారు. మండల స్థాయిలో అధికారులు క్షేత్ర స్థాయిలో జరిగే విషయాలను ప్రతి గంటకు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కు తెలియజేస్తారు. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 108, 102, 104 అత్యవసర సేవలకు ఎన్‌టీఆర్ వైద్యసేవ డి.సి.డాక్టర్ పి.హేమంత్ మొబైల్ నంబర్– 9618202424ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ప్రజలు ఇంటికే పరిమితమవ్వండి...
అత్యవసర పరిస్థితులు తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షంలో బయటకు వెళ్లవద్దు. అనవసర ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలని ఇప్పటికే ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించి నీరు చేరిన ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులు వంటి ప్రదేశాల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులు, వంకలు, నదులు ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. సరదాగా ఈత, స్నానం కోసం నీటిలో దిగకూడదు. అత్యవసర సహాయం కోసం ఏదైనా ప్రమాదం గమనించినా, విద్యుత్ వైర్లు తెగిపడినా, చెట్టు కూలినా, నీరు ఇళ్లలోకి చేరినా వెంటనే సమాచారం ఇవ్వండి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా తప్పుడు సమాచారం లేదా వదంతులు సోషల్ మీడియాలో పంచుకునే వ్యక్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ హెచ్చరించారు.
27 పునరావాస కేంద్రాల ఏర్పాటు:
జిల్లాపై తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి సర్వ సన్నద్ధంగా ఉందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సోమవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించే అవకాశమున్నందున, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులను కేటాయించామని, ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించామని ఆయన వివరించారు. జిల్లా వ్యాప్తంగా 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలైన సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, భోజన వసతి, విద్యుత్ పోతే జనరేటర్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. తుపాను సమయంలో కమ్యూనికేషన్ ముఖ్యం కాబట్టి సెల్‌ఫోన్ టవర్స్ వద్ద పవర్ బ్యాకప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సెల్ కంపెనీల ప్రతినిధులకు ఆయన సూచించారు. జిల్లాకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు కూడా వచ్చాయని ఆయన తెలిపారు.
పూర్తిగా నిండిన 50 సాగునీటి చెరువులు...
జిల్లాలో సాగునీటి చెరువులు 50 పూర్తిగా నిండాయి. అందుకోసం ప్రతి చెరువు వద్ద ఒక అధికారిని నియమించి పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా తుపాను ముందస్తుగా చర్యల్లో భాగంగా ట్రైల్ రన్ నిర్వహించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎంత సమయంలో తరలిస్తారు, చెట్లు పడిపోతే ఆ ప్రదేశాలకు ఎంత సమయంలో చేరుకుంటాం అనే విషయాలపై ట్రయిల్ రన్ చేపట్టారు.
మార్కాపురం: తుపాను ప్రభావంతో పశ్చిమ ప్రకాశంలోని పలు మండలాల్లో పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కాపురం వ్యవసాయ సబ్‌డివిజన్‌లో పత్తికి సంబంధించి సుమారు 4,753 హెక్టార్లలో పంట దెబ్బతిని నష్టం జరగగా సుమారు రూ.53 కోట్లకు పైగా పత్తి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. తుపాను ప్రభావం కొనసాగితే మిర్చితోపాటు పత్తికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో సాగుచేసిన పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మార్కాపురం ప్రాంతంలో గుండ్లకమ్మ నిండుగా ప్రవహిస్తోంది. దీంతోపాటు ఉప్పువాగు, చెరువు వాగు, మార్కాపురం చెరువు కాలువ కూడా పారుతోంది.
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
మోంథా వణుకు..


