తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధం
● ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
ఒంగోలు టౌన్: జిల్లాలో తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కంట్రోలు రూంను సందర్శించిన ఎస్పీ.. తుఫాన్ సహాయక చర్యల గురించి అఽఽధికారులకు సలహాలు, సూచనలు చేశారు. కంట్రోలు రూంలోని డయల్ 100, 112 రోజంతా పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే ప్రతి కాల్‌కు స్పందించాలని, ప్రజలు చెప్పే సమస్యలను శ్రద్ధగా వినాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా వచ్చే లైవ్ ఫీడింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పారు. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత భద్రత గురించి స్పష్టమైన సూచనలు చేశారు. ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొనాలని చెప్పారు. లైఫ్ జాకెట్లు, రోపులు, కట్టర్లు, జేసీబీలు, క్రేన్లు, ట్రాక్టర్లు వంటి అత్యవసర సామగ్రిని పోలీసులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తుఫాన్ పరిస్థితులను వివరించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి హ్యాండ్ మైకులు సిద్ధం చేసినట్లు తెలిపారు. వాగులు, వంకలు, కాలువలు, చప్టాలు, నదులు ఉప్పొంగి ప్రవహించే సమయంలో కరకట్టలు తెగే ప్రమాదం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈదురు గాలుల వలన విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి రహదారులకు అడ్డంకులు కలిగిస్తే వాటిని తొలగించడానికి డోజర్లు, జేసీబీలు, క్రేన్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్బీ సీఐ రాఘవేంద్ర, కంట్రోలు రూం సీఐ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
పాకల బీచ్‌ని పరిశీలించిన ఎస్పీ...
సింగరాయకొండ: తుఫాన్ ప్రభావంతో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పోలీసు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అన్నారు. సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్‌ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీచ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, సిబ్బంది ఎప్పటికప్పుడు మైక్‌ల ద్వారా హెచ్చరిస్తున్నారని తెలిపారు. ప్రజలు మూడు రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు, తాగునీరు సిద్ధంగా ఉంచుకోవాలని, పోలీసులు చేపట్టిన చర్యలకు సహకరించాలని, ఎటువంటి విపత్తు సంభవించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వివరించారు. సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సైలు బి.మహేంద్ర, నాగమల్లేశ్వరరావు, సర్పంచ్ సైకం చంద్రశేఖరరావు, ఈఓ సుభాని పాల్గొన్నారు.


