వర్షాలకు దెబ్బతిన్న వరి నారు
● సుమారు రూ.15 లక్షల నష్టం
సింగరాయకొండ: మండలంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు సుమారు వెయ్యి ఎకరాలలో మాగాణి సాగుకు సరిపడా వరినారుమళ్లు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 25 కేజీల చొప్పున వరి విత్తనాలతో నారు పోశారు. బస్తా ధర రూ.1,200 కాగా, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.1,500 వెచ్చించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నారుమళ్లలో నీరు నిలిచి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నారును నాటుకున్నప్పటికీ పైరు సక్రమంగా పెరగదని పాకల రైతు, ఎంపీటీసీ గోళ్లమూడి అశోక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ ఐదు రోజుల పాటు తుఫాన్ ప్రభావం ఉంటుందని చెబుతున్నారని, ఇలా అయితే మళ్లీ ఎప్పుడు నారు పోసుకోవాలో అర్థం కావడం లేదని అన్నారు. అదునులో నారు పోసుకోకపోతే తెగుళ్ల బెడద ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి జిలకర మసూర రకం కాకుండా తక్కువ రకం నెల్లూరు జిలకర రకం పోసుకునే పరిస్థితి ఉందన్నారు. కానీ, వ్యవసాయాఽధికారులు మాత్రం తక్కువ ఎకరాల్లోనే నారుమళ్లు పోశారని, అవి మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పడం విశేషం.


