అల్లకల్లోలంగా సముద్రం..ఎగసిపడుతున్న అలలు
కొత్తపట్నం/సింగరాయకొండ: తుపాను ప్రభావంతో సోమవారం సాయంత్రం నుంచి అలలు ఎగసిపడుతుండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మంగళవారం ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున తీర ప్రాంతంలో మైరెన్ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరాయకొండ మండలం పాకల బీచ్‌ను సోమవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. కొత్తపట్నం, ఈతముక్కల, మడనూరు, పాకల బీచ్ ప్రాంతాలకు పర్యాటకులు రాకుండా మైరెన్ పోలీసులు అదుపు చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా పుణ్యస్నానాలు చేసి దీపాలు వెలింగే భక్తులను రాకుండా చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులు తీరంలో ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. మత్స్యకారులు పడవలు, వలలు, ఇంజన్లు సామగ్రి అంతా సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. సముద్రం ఒడ్డున ఉన్న మరి కొన్ని పడవలు, సామగ్రిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఇప్పటికే సముద్రం కోతకు గురైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మత్స్యకార గ్రామాల్లో మైక్‌లు ద్వారా, చాటింపు ద్వారా ప్రచారం చేశారు. తీరం వెంబడి మైరెన్ సిబ్బంది గస్తీ తిరుగుతున్నారు.


