అత్యధికంగా 6,200 హెక్టార్లలో దెబ్బతిన్న పత్తి మోంథా తుపానుకు ముందు జరిగిన పంట నష్టాలు
ఒంగోలు సబర్బన్: వరుసబెట్టి కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 8,500 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరుసగా ఈ నెల 20వ తేదీ నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. వెంటనే ‘‘మోంథా’’ తుపాను ఈ వర్షాలకు తోడయింది. దాంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. మోంథా తుపానుకు ముందు వరుసగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాగు చేసిన ఆరు రకాల పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా 49,046 హెకార్లలో రైతులు సాగు చేశారు. అందులో 8,200 హెక్టార్లు ఇప్పటికే దెబ్బతిన్నాయి. పత్తి 18,750 హెక్టార్లలో జిల్లా వ్యాప్తంగా సాగు చేశారు. అందులో 6,200 హెక్టార్లలో పత్తి పంట వర్షాలకు దెబ్బతింది. ఇక సజ్జ పంట 4,231 హెక్టార్లలో సాగు చేస్తే 1,775 హెక్టార్లలో నష్టపోయింది. మొక్కజొన్న 8,800 హెక్టార్లలో సాగు చేస్తే 125 హెక్టార్లలో దెబ్బతింది. వరి 16,704 హెక్టార్లలో సాగు చేస్తే 52 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. వేరుశనగ 435 హెక్టార్లలో సాగు చేస్తే 10 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. జొన్న 125 హెక్టార్లలో సాగు చేస్తే 6 హెక్టార్లలో దెబ్బతింది. మిగతా వాటిల్లో ఉద్యాన పంటల్లో 100 హెక్టార్లలో మిర్చి, 80 హెక్టార్లలో కూరగాయలు, రెండు హెక్టార్లలో పూలతోటలు దెబ్బతిన్నాయి. పొగాకు పంట కూడా కొన్ని చోట్ల దెబ్బతినగా, మరికొన్ని చోట్ల పొగాకు నారుమడులు దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచే మోంథా తుపాను ప్రభావం ప్రారంభమైంది. రెండు, మూడు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


