
వలంటీర్ విధుల నుంచి విముక్తి కలిగించండి
● నిరసన వ్యక్తం చేసిన వార్డు సచివాలయ కార్యదర్శులు
ఒంగోలు సబర్బన్: వలంటీర్ విధుల నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల రాష్ట్ర ఉమ్మడి ఐక్యవేదిక నూతన కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.శ్రీ మహా విష్ణు మాట్లాడుతూ సచివాలయం ఉద్యోగులకి డోర్ టు డోర్ సర్వీసెస్, సర్వేలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 21 విభాగాల్లో ఉన్న ఉద్యోగులందరికీ జిల్లా డీఎస్సీ ద్వారా మెరిట్ లిస్ట్ తయారుచేసి అవకాశం ఉన్నంత వరకు ప్రమోషన్స్ కల్పించాలన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో టెక్నికల్, ప్రొఫెషనల్ ఉద్యోగులకి గ్రేడ్ 1,2,3 అనే విధానం రద్దు చేయాలని కోరారు. అందర్నీ డైరెక్ట్ డిీజిగ్నేషన్‌తో గుర్తించాలన్నారు. బీఎల్‌ఓ డ్యూటీ సచివాలయ ఉద్యోగులందరికీ పూర్తిగా తొలగించి గతంలో ఉన్న వారికే అప్పగించాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రికార్డ్ అసిస్టెంట్ స్కేలు పూర్తిగా తొలగించి కనీసం బేసిక్ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అమలు చేయాలన్నారు. అక్టోబర్ 2 నాటికి ఆరేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఒకటి ఇవ్వాలని కోరారు. అదనపు డ్యూటీ ఇన్చార్జిగా చేసినప్పుడు వాళ్లకి ప్రత్యేక శాలరీ మంజూరు చేయాలన్నారు. రావాల్సిన సరెండర్ లీవ్స్ వెంటనే క్యాష్ చేసుకునేలా అప్డేట్ చేయాలన్నారు. అలాగే గతంలో ప్రొబేషన్ లేట్ అయినందుకు ఎనిమిది నెలల అరియర్స్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు వారి మాతృ శాఖలు గుర్తించి వారి అండర్లో నడిచేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జనరల్ సెక్రటరీ ఎస్‌కే.రహంతుల్లా, కోశాధికారి షేక్ గౌస్ భాష పాల్గొన్నారు.