
కలెక్టర్ ఉత్తర్వులనూ లెక్కచేయం..!
మర్రిపూడి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చనేతల అవినీతి అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ భూములను సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తూ పశువుల మేత భూమిని కూడా మేసేస్తున్నారు. పలువురు పచ్చనేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారుల అండతో మేత భూమికి వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదు చేయించుకుని ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలు తెచ్చుకున్నారు. దీనిపై కలెక్టర్ ఉత్తర్వులను కూడా లెక్కచేయకుండా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఆ వివరాల్లోకెళ్తే.. మర్రిపూడి మండలంలోని గుండ్లసముద్రం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 571లో 207.86 ఎకరాల విస్తీర్ణంలో పశువుల మేత భూమి ఉంది. ఆ భూమిలో మండలంలోని ఎస్టీరాజుపాలెం, గుండ్లసముద్రం, కోష్టాలపల్లి, రేగలగడ్డ గ్రామాలకు చెందిన పశువులను మేపుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు, కాసులకు కక్కుర్తిపడి పశువుల బీడును సబ్‌డివిజన్ చేసి మరీ పచ్చనేతల పేర్లను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. సుమారు 200 ఎకరాల మేత భూమిని పలువురు ఆక్రమించుకుని యథేచ్ఛగా అనుభవిస్తున్నారు. ఈమేత భూమి ఆక్రమణపై ‘పశువుల బీడు ఫలహారం’ అనే శీర్షికతో ఈ ఏడాది మే 17న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. పశువుల మేత భూమిని ఆక్రమణదారుల చర నుంచి కాపాడాలంటూ అప్పటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు గుండ్లసముద్రం గ్రామస్తులు ఫిర్యాదు కూడా చేశారు. విచారించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో ఉన్న పేర్లను తొలగిస్తామని కలెక్టర్, జేసీ హామీ ఇచ్చారు. ఆ మేరకు కిందిస్థాయి అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం. కానీ, నేటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు పశువుల మేత భూమిని యథేచ్ఛగా ఆక్రమించి దున్నుకుంటున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మిన్నకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారుల నుంచి మేతభూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ నాగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా, ఈ విషయం తనకు తెలియదని, స్థానిక వీఆర్‌ఓను అడిగి తెలుసుకుని చెబుతానని అన్నారు.
200 ఎకరాల పశువుల మేత భూమిని యథేచ్ఛగా ఆక్రమించిన పచ్చనేతలు
పట్టించుకోని రెవెన్యూ అధికారులు

కలెక్టర్ ఉత్తర్వులనూ లెక్కచేయం..!