
నిత్యావసరాల ధరలు తగ్గించాలి
ఒంగోలు సబర్బన్: నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో సంతకాలు సేకరించి సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా అధికారులకు అర్జీ అందజేశారు. జేసీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రకాశం భవన్‌లోని పీజీఆర్‌ఎస్ భవన్‌లో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ 14 రకాల సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వమే ప్రజలకు అందించాలన్నారు. ధరల నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. గత ఆరు నెలలుగా రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారని, కందిపప్పు, నూనె ఊసే లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కందిపప్పు, నూనె, నిత్యావసర వస్తువులన్నీ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేసేవారని, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే వాహనాలు రద్దు చేశామనడం సమంజసంగా లేదన్నారు. రేషన్ షాపులు ఉన్న కాలంలోనూ, వాహనాలు నడిచిన కాలంలోనూ, నేడు కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్నారు. అక్రమాలను అరికట్టాలంటే ప్రజలు తినగలిగే సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందించాలని కోరారు. రేషన్ షాపుల ద్వారా తినడానికి వీలైన నాణ్యమైన బియ్యం అందిస్తే అక్రమాలు క్రమంగా ఆగిపోతాయన్నారు. ధరలకు అనుగుణంగా సామాన్యులకు వేతనాలు పెరగడం లేదన్నారు. అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజానీకం పౌష్టికాహారాన్ని తినలేకపోతున్నారని, ఫలితంగా మహిళలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు ప్రభుత్వాలు ఎగుమతి, దిగుమతుల్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, ధరల పెరుగుదలకు అవి మరింత ఆజ్యం పోస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి జి.ఆదిలక్ష్మి, సహాయ కార్యదర్శి కె.రాజేశ్వరి పాల్గొన్నారు.
అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి : జేసీ గోపాలకృష్ణ
ప్రజల నుంచి వస్తున్న అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు నాణ్యతతో పరిష్కరించాలని జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రకాశం భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో మాట్లాడారు. తన పరిధిలో ఉన్న వాటిపై వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులతో చర్చించారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల అర్జీలు పునరావృతమయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 227 అర్జీలు ఆయా శాఖలలో పునరావృతం అయ్యాయన్నారు. నిబంధనల ప్రకారం సరైనవో, కావో చూడాలని, సరైనవి కాకుంటే అర్జీదారులకు వివరించాలని సూచించారు. గడువులోగా అర్జీలను పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. గడువు తీరిన అర్జీలు 15 ఆయా శాఖలలో పెండింగ్లో ఉండటంపై జేసీ ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీవో కళావతి, సబ్ కలెక్టర్లు వరకుమార్, మాధురి, విజయ, జ్యోతికుమారి, వరలక్ష్మి, అనుబంధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
14 రకాల సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా అందించాలి
మీ కోసం కార్యక్రమంలో జేసీకి అర్జీ అందజేత