
వేదన తీరక!
వేతనాలందక..
● పొజిషన్ ఐడీల కేటాయింపుల్లో నిర్లక్ష్యం ● బదిలీలు జరిగి నెలరోజులు కావస్తున్నా ఇవ్వని ఐడీలు ● జీతాలు రాక అవస్థలు పడుతున్న టీచర్లు ● విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడుతున్న ఉపాధ్యాయులు ● 1600 మంది గురువులపై ప్రభావం ● వెంటనే ఐడీలు ఇవ్వాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
బదిలీలు ఉపాధ్యాయులకు శాపంగా మారాయి. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి వారు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. సాంకేతిక సమస్యలు, ఆందోళనలతో బదిలీల
వ్యవహారం ప్రహసనంగా సాగింది. తాజాగా స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యాశాఖ పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడంతో జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. బదిలీల సాకుతో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడుతున్నాయి.
ఒంగోలు సిటీ:
వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు ప్రారంభమైనా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతూనే వచ్చాయి. అర్ధరాత్రి వరకూ కౌన్సెలింగ్ నిర్వహించడంతో వారు పడిన అగచాట్లు అన్నీ ఇన్నీకావు. మే నెల చివర్లో ప్రధానోపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలి రెండు రోజులు ఆన్‌లైన్ సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత ఎస్జీటీల బదిలీల ప్రక్రియ మొదలైంది. ఆన్‌లైన్ వద్దని ఆఫ్‌లైన్‌లో బదిలీల కౌన్సెలింగ్ చేపట్టాలని ఆందోళన చేశారు. కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వం దిగిరావడంతో కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రకరకాల సమస్యలతో కౌన్సెలింగ్‌కు అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. అర్ధరాత్రి వరకూ కౌన్సెలింగ్ నిర్వహించడంతో మహిళా ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబ సభ్యులు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి పడిగాపులు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గత నెల 15వ తేదీన ముగించారు. ఉమ్మడి జిల్లాలో 3931 మందికి స్థానచలనం కలిగింది. ఇదంతా ఒక ఎత్తయితే బదిలీ అయిన వారికి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో కొత్త సమస్య ఎదురైంది.
పొజిషన్ ఐడీల కేటాయింపుల్లో
తీవ్ర నిర్లక్ష్యం...
ఉద్యోగులు, ఉపాధ్యాయులు సాధారణంగా బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా ఆ ప్రాంతంలోని డీడీఓలకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఉపాధ్యాయులకు ఐడీలు కేటాయించాలి. బదిలీలు పూర్తయి నెల రోజులు దాటినా ఇంత వరకు చాలా మంది ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలను కేటాయించలేదు. దీంతో జూన్ నెలకు సంబంధించి జూలైలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు అందకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా ఉపయోగం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వచ్చే నెల కూడా తమకు జీతాలు పడే అవకాశాలు కనిపించడం లేదని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇలా చిన్నచూపు చూడడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి పొజిషన్ ఐడీలు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జీతాలందక పాట్లు..
పాఠశాలల ప్రారంభంలో జూన్ నెలలో ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి కోసం వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులు బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, అడ్వాన్సుల రూపంలో మరింత ఖర్చు పెరిగిందని, ఇటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో నానా అగచాట్లు పడుతున్నామని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.