
పశువుల మేత భూమి కబ్జా
ఒంగోలు సబర్బన్: పొదిలి మండలం నిమ్మవరం గ్రామంలో స్థానికంగా ఉంటున్న అధికార పార్టీకి చెందిన నాయకుడు 8.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడని, అదే గ్రామానికి చెందిన గుదె నాగరాజు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి గ్రామస్థులు కొందరితో కలిసి వచ్చిన నాగరాజు ప్రభుత్వానికి చెందిన సర్వే నంబరు 8/4లోని పశువుల మేత భూమిని అధికార పార్టీకి చెందిన కొల్లూరి నాసరయ్య కబ్జా చేసి సాగు చేసుకుంటున్నాడని కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలోని పశువులు మేతకోసం అల్లాడుతున్నాయన్నారు.
● నిమ్మవరం గ్రామానికే చెందిన కటికాల నాగేశ్వరరావు కూడా కలెక్టర్‌ను కలిసి తనకు అన్యాయం జరిగిందన్నారు. గ్రామంలో తనకు గ్రామ సర్వే నం. 7/3లో 2 ఎకరాల పొలం ఉందని, ఆన్‌లైన్‌లో తన పేరు మీదనే నమోదై ఉందన్నారు. పాస్‌బుక్ కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆ పొలాన్ని తానే సాగు చేసుకుంటున్నానని వివరించాడు. అయితే తమ గ్రామానికి చెందిన కొల్లూరి నాసరయ్య, ఆయన కుమారుడు కొల్లూరు నరేష్, పొదిలి మండలం కాటూరివారిపాలేనికి చెందిన కోటు వెంకట్రావు, కోటు శ్రీనులు ఈ నెల 16వ తేదీ తమ పొలాన్ని దౌర్జన్యంగా దున్నారన్నారు. వాళ్లు రెండు ట్రాక్టర్లతో వచ్చి ఈ పొలం మాది మేము కొన్నామని దౌర్జన్యం చేస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. తాను పొలం ఎవరికీ అమ్మలేదని, దొంగ డాక్యుమెంట్లు తయారు చేసుకొని తనను బెదిరిస్తున్నారని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌నే వేడుకున్నాడు.
ఏపీఐఐసీ ప్లాట్లను 22ఏ నుంచి తొలగించాలి..
సింగరాయకొండలో ఏపీఐఐసీ ప్లాట్లను నిషేధిత 22ఏ నుంచి తొలగించి తనకు అప్పగించాలని టంగుటూరు మండలానికి చెందిన ఒక కుటుంబం వచ్చి జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణకు విన్నవించారు. టంగుటూరుకు చెందిన కొణిజేటి సత్యనారాయణ కుటుంబ సభ్యులు వచ్చి సింగరాయకొండ ఏపీఐఐసీ ప్లాట్లలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సోమరాజుపల్లి గ్రామ సర్వే నం.677 లో 100, 101 నంబరున్న ఏపీఐఐసీ ప్లాట్లు 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. ఏపీఐఐసీ వాళ్లు లేఅవుట్ ప్లాను ప్రకారం ప్లాట్లు పెట్టారని అయితే ప్రభుత్వ రికార్డుల్లో 22 ఏ నిషేధిత జాబితాలో ఉందని సబ్ రిజిస్ట్రార్ కార్యాల యం అధికారులు చెబుతున్నారని చెప్పారు. ఏపీఐఐసీ అధికారులు తమ పేరుమీద సేల్ డీడ్ కూడా చేశారని, పరిశీలించి తమ ప్లాట్లను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు.
అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి:
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. అర్జీలు పరిశీలించి అర్జీదారులు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఎస్.డి.సీ వర కుమార్, శ్రీధర్ రెడ్డి, జాన్సన్, పార్ధసారధి, కుమార్ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బెదిరిస్తున్నారు సింగరాయకొండలోని ఏపీఐఐసీ భూమిలో 22ఏ కింద రిజిస్ట్రేషన్లు ఆపారు మీ కోసంలో కలెక్టర్‌కు సమస్యల వినతి