
పెన్షన్ వాలిడేషన్ బిల్లు రద్దు చేయాలి
ఒంగోలు సబర్బన్: కేంద్ర ఆర్థిక బిల్లులో చొప్పించిన పెన్షన్ వాలిడేషన్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంచర్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పెన్షనర్లు తరలి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. జిల్లా యూనియన్ అధ్యక్షుడు బి.అంకిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెన్షనర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. 1972 నుంచి ఉన్న పెన్షన్ చట్టాన్ని మార్చి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను విస్మరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ దయాధర్మ బిక్షం కాదని, ఇది ఉద్యోగుల హక్కు అని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ బిల్లుతో 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. భవిష్యత్‌లో పే కమిషన్ సిఫార్సులు పాత పెన్షనర్లకు వర్తించకుండా చేయడానికి కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాయని మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక బిల్లులో భాగంగా మార్చి 25న లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, మార్చి 29న రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఇది చట్టమైతే సీనియర్ పెన్షనర్లకు పెన్షన్ అప్‌డేషన్ గాలిలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ లాంటి సందర్భాల్లో కేంద్రం మూడు డీఏల చెల్లింపులను నిలిపేసిందని, రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయని మండిపడ్డారు. తక్షణమే కేంద్రం 8వ పీఆర్సీ, రాష్ట్రానికి 12వ పీఆర్సీ నియమించి అమలయ్యే వరకు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు బీ అంకిరెడ్డి, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.రామ్మోహన్ రావు మాట్లాడుతూ పెన్షన్ బిల్లును ఉపసంహరించకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అసోసియేషన్ నాయకులు పరిటాల సుబ్బారావు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కంభం యూనిట్ అధ్యక్షుడు ఎం.డి.ఇబ్రహీం, పొదిలి యూనిట్ ఉపాధ్యక్షుడు ఏ.బాదుల్లా, ఏపీటీ ఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు ఎం కృష్ణయ్య, మర్రి లక్ష్మీనారాయణ, నేలటూరి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. అనంతరం కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు.
పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ఆందోళన