
అర్హులకు ఇంటి నివేశన స్థలం
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
ఒంగోలు సబర్బన్: రానున్న మూడేళ్లలో జిల్లాలో ఇల్లు లేని వారు ఉండరాదన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జేసీ రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారుల వివరాలను పెండింగ్‌లో లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పీజీఆర్‌ఎస్‌లో రెవెన్యూ అంశాలపై వచ్చిన దరఖాస్తుల పెండెన్సీ, ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ, రీ సర్వే పురోగతి, కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డుల మంజూరు, నిత్యావసర సరుకుల పంపిణీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో సమావేశంలో ఎస్‌డీసీలు వరకుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఎస్‌ఓ పద్మశ్రీ, జిల్లా సర్వ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా తదితర అధికారులు పాల్గొన్నారు.