
ఏడుగురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల సస్పెన్షన్
మార్కాపురం: పార్టీ ఆదేశాలను ధిక్కరించి మున్సిపల్ చైర్మన్‌పై జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్‌లో పాల్గొన్న ఏడుగురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటన జారీ చేసింది. గత నెల 11వ తేదీన మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణపై టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించగా ఏడుగురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 17వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, 24వ వార్డు కౌన్సిలర్ బుసెట్టి నాగేశ్వరరావు, 19వ వార్డు కౌన్సిలర్ టీ.రంగలక్ష్మమ్మ, 29వ వార్డు కౌన్సిలర్ షేక్ ఖుర్షీద్ బి, 10వ వార్డు కౌన్సిలర్ ఏలూరు జ్యోతి, 12వ వార్డు కౌన్సిలర్ షేక్ ఫాతిమా, 14వ వార్డు కౌన్సిలర్ బుర్రి ఎల్లమ్మను సస్పెండ్ చేశారు.
నైపుణ్యాభివృద్ధిలో యువత ముందుండాలి
ఒంగోలు సిటీ: పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ప్రత్యక్షంగా కానీ, ఆన్‌లైన్ ద్వారా కానీ ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారిణి రమాదేవి పేర్కొన్నారు. ప్రపంచ యువనైపుణ్య దినోత్సవంలో భాగంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో జనశిక్షణ సంస్థ, ఐటీఐ కళాశాల, జిల్లా యువజన సర్వీసుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధిలో యువత ముందుండాలని అదే సమయంలో క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ బాబు, జనశిక్షణ సంస్థ డైరక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
‘నెత్తురు నది’కి నాగభైరవ సాహిత్య పీఠ పురస్కారం
ఒంగోలు మెట్రో:
జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పేరిట నాగభైరవ సాహిత్య పీఠం ఏటా ఇచ్చే అనువాద సాహిత్యంపై పురస్కార ప్రదానం కోసం పుస్తకాలను ఆహ్వానించింది. వచ్చిన పుస్తకాలను పరిశీలించి న్యాయనిర్ణేతల అభిప్రాయం మేరకు రూ.10 వేల ప్రథమ బహుమతికి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రచించిన ‘నెత్తురు నది’ నవలను, రూ.5 వేల ద్వితీయ బహుమతికి కోనేరు కల్పన రచించిన ‘దర్పణం’ కథా సంపుటిని ఎంపిక చేసినట్టు సాహితీ పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 17వ తేదీ ఆదివారం ఉదయం జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నిందితుడికి 80 రోజుల జైలు
● మరో ఇద్దరికి 30 రోజులు, ఇంకొకరికి 15 రోజుల శిక్ష..
● రూ.10 వేల చొప్పున జరిమానా కూడా..
గిద్దలూరు రూరల్/కంభం/బేస్తవారిపేట:
పట్టణంలోని రాచర్ల గేటు సెంటర్ వద్ద మద్యం మత్తులో, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి 80 రోజుల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం గిద్దలూరు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భరత్‌చంద్ర తీర్పు వెల్లడించినట్లు సీఐ కె.సురేష్ తెలిపారు.
● కంభం పరిధిలో మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు 30 రోజుల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గిద్దలూరు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి తీర్పు వెల్లడించినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు.
● బేస్తవారిపేట మండల పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరిని మంగళవారం గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.భరత్‌చంద్ర తీర్పు వెల్లడించినట్లు ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డి తెలిపారు. ఒకరికి రూ.10 వేల జరిమానా, 15 రోజుల జైలు శిక్ష, మరొకరికి రూ.10 వేలు జరిమానా, 30 రోజుల జైలు శిక్ష విధించారని వివరించారు.