షాక్‌..! | - | Sakshi
Sakshi News home page

షాక్‌..!

Jul 13 2025 4:35 AM | Updated on Jul 13 2025 4:35 AM

షాక్‌

షాక్‌..!

● దర్శి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నియామకంలో ఊహించని పరిణామం ● నాలుగు నెలల క్రితమే టీడీపీకి చెందిన నాగవేణిని ప్రకటించిన ఆ పార్టీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి ● బీజేపీకి చెందిన నారాయణమ్మను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ● పేరు మార్పిస్తామని, చైర్మన్‌ పదవి మాదేనని అంటున్న టీడీపీ నాయకులు ● నోరు మెదపని లక్ష్మి ● మా సంగతి ఏంటంటూ మదనపడుతున్న జనసేన నేతలు
నాగవేణికి నారాయణమ్మ

ఇష్టారాజ్యంగా రిజర్వేషన్ల ఉల్లంఘనలు...

మండిపడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్మన్ల నియామకంలో కూటమి పాలకులు ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు ఉల్లంఘించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ జీవో నంబర్‌ 77 విడుదల చేశారు. ఇప్పుడు కూడా దాని ప్రకారమే ఏఎంసీ చైర్మన్లను నియమించాలని కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులిచ్చిన కూటమి పాలకులు.. ఆచరణలో మాత్రం ఎక్కడా పాటించకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది పాటు రిజర్వేషన్లను సడలిస్తున్నట్లు ఎక్కడికక్కడ జీవోలు విడుదల చేసి రిజర్వేషన్లకు తూట్లు పొడిచినట్లు సమాచారం. తద్వారా తమకు ఇష్టమొచ్చిన నాయకులు, తమను సంతృప్తిపరిచిన నాయకులు, గత ఎన్నికల్లో తమ కోసం భారీగా ఖర్చు చేసిన వారికి ఏఎంసీ చైర్మన్‌ పదవులు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. చైర్మన్ల నియామకాలకు సంబంధించిన రిజర్వేషన్లపై జీవో నంబర్‌ 77ను ఇటీవల కలెక్టర్‌ విడుదల చేశారు. దాని ప్రకారం యర్రగొండపాలెం ఏఎంసీ చైర్మన్‌ పదవి ఎస్టీకి రిజర్వ్‌ అయింది. కానీ, కూటమి పాలకులు టీడీపీ సామాజికవర్గానికి చెందిన చేకూరి సుబ్బారావు పేరు ప్రకటించారు. అలాగే, పొదిలి చైర్మన్‌ పదవిని బీసీ మహిళ (మైనారిటీ)కు రిజర్వ్‌ చేశారు. కానీ, ఇక్కడ బీసీ జనరల్‌కు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనిగిరిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కనిగిరికి ఎస్సీ మహిళను రిజర్వ్‌ చేయగా, పామూరు మండలానికి చెందిన యారవ శ్రీనివాసులచౌదరిని తొలుత చైర్మన్‌గా ప్రకటించారు. ఆ తర్వాత అతని సతీమణి పేరును ప్రకటించారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ స్థానంలో ఓసీని ఎలా నియమిస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లు మార్చడం రాజ్యాంగ విరుద్ధమని, జీవో నంబర్‌ 77ను రద్దు చేయాలనుకుంటే కేబినేట్లో నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. రిజర్వేషన్లకు భిన్నంగా ఏఎంసీ చైర్మన్ల నియామకాలపై ఎస్సీ, ఎస్టీలు మండిపడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

ర్శి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌ పదవి నియామకంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ పదవికి టీడీపీ నాయకుడు దారం సుబ్బారావు సతీమణి, దర్శి మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్‌ అయిన దారం నాగవేణిని ఎంపిక చేసినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి నాలుగు నెలల క్రితమే ప్రకటించారు. దీంతో దారం సుబ్బారావు, నాగవేణి దంపతులు మార్కెట్‌ చైర్మన్‌ పేరుతో అనేక కార్యక్రమాలకు ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు. ఏఎంసీ చైర్మన్‌ పదవి దక్కుతుందనే ఉత్సాహంతో టీడీపీ కార్యక్రమాలకు భారీగా డబ్బు కూడా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకుడు, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి మాడపాకుల శ్రీనివాసరావు సతీమణి నారాయణమ్మను దర్శి ఏఎంసీ చైర్మన్‌గా నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం అకస్మాత్తుగా విడుదల చేసిన జాబితాలో దర్శి ఏఎంసీ చైర్మన్‌గా బీజేపీకి చెందిన నారాయణమ్మ పేరు ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, టీడీపీ శ్రేణులు, నాగవేణి వర్గీయులు షాక్‌కు గురయ్యారు.

గొట్టిపాటి లక్ష్మీపై తీవ్ర అసంతృప్తి...

దర్శి ఏఎంసీ చైర్మన్‌ పదవిని తొలుత ఎస్సీ సామాజికవర్గానికి కేటాయించారు. గొట్టిపాటి లక్ష్మి చక్రం తిప్పి దానిని ఓసీగా మార్పించి కాపు సామాజికవర్గానికి చెందిన దారం నాగవేణిని ప్రకటించారు. అప్పటి నుంచి ఎస్సీ సామాజికవర్గం వారు తమకు వచ్చిన అవకాశాన్ని తమకు దక్కకుండా చేసిన గొట్టిపాటి లక్ష్మిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన ఎస్సీలంతా రగిలిపోతున్నారు. కానీ, చివరకు బీజేపీకి చెందిన బీసీ సామాజికవర్గ మహిళ మాడపాకుల నారాయణమ్మ పేరును ప్రభుత్వం ఫైనల్‌ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి రెండు రోజులుగా నోరు మెదపకపోవడంతో టీడీపీ శ్రేణులు కూడా ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీకి ఏఎంసీ చైర్మన్‌ పదవి కేటాయించినందుకు గొట్టిపాటి లక్ష్మికి ధన్యవాదాలు తెలపడంతో లక్ష్మిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. దీనిపై ఆమె స్పందించకపోవడం, పేరు మార్పు ప్రచారం గురించి స్పష్టత ఇవ్వకపోవడంతో బీజేపీ వారికే బలం చేకూరినట్లయింది. నాలుగు నెలల క్రితమే తమ పేరు ప్రకటించినప్పటికీ పదవి దక్కకపోవడంపై టీడీపీ నాయకులు, దారం వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు.

జనసేన నాయకుల నైరాశ్యం...

ఇదిలా ఉండగా, దర్శి ఏఎంసీ చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకుని ఉన్న జనసేన నాయకులు నైరాశ్యానికి గురయ్యారు. బీజేపీ కంటే ఎక్కువ శాతం ఓట్లు జనసేనకు ఉన్నాయని, తమ మద్దతుతోనే టీడీపీకి బలం చేకూరుతుందని, కానీ, తమకెందుకు ఏఎంసీ చైర్మన్‌ పదవి ఇవ్వకూడదని జనసేన పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జనసేనకు ఇన్‌చార్జ్‌గా ఉన్న నేతలెవరూ ఇక్కడకు రాకపోవడం, తమ పార్టీ వారికి ఏఎంసీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని అడగకపోవడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ దర్శి ఏఎంసీ చైర్మన్‌ పదవి నియామకంతో నియోజకవర్గంలో రాజకీయ దుమారం లేచిందని, కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన ఏఎంసీ చైర్మన్ల జాబితాలో దర్శికి సంబంధించి కంప్యూటర్‌ ఆపరేటర్‌ తప్పిదం వలన పేరు పొరపాటు పడిందని, నాగవేణికే చైర్మన్‌ పదవి కేటాయిస్తూ మార్పులు జరగడం ఖాయమని దారం సుబ్బారావు వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవ్‌, మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒత్తిడి మేరకు బీజేపీ కోటా కింద దర్శి ఏఎంసీ పదవిని నారాయణమ్మకు కేటాయించారంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. టీడీపీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి కూడా తమకు సహకరించారంటూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ధన్యవాదాలు తెలిపారు.

కంప్యూటర్‌ ఆపరేటర్‌ తప్పిదమని, పేరు మార్చడం ఖాయమని ప్రచారం...

షాక్‌..!1
1/2

షాక్‌..!

షాక్‌..!2
2/2

షాక్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement