
ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి
పామూరు: ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీ టైరు కిందపడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన పామూరు మండలంలోని తిరగలదిన్నె గ్రామం వద్ద 565వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సీఎస్ పురం మండలం కంభంపాడు గ్రామానికి చెందిన మేకల అంజమ్మ (49) ఇసుక ట్రాక్టర్ పనికి వెళ్లింది. మండలంలోని తిరగలదిన్నెవద్ద నుంచి గోపాలపురంకు ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్.. తిరగలదిన్నె వద్ద 565వ నంబర్ జాతీయ రహదారిపైకి ఎక్కే సమయంలో అదుపుతప్పింది. జాతీయ రహదారి దిగి గుంతల్లోకి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర కుదుపులకు గురైంది. ఆ సమయంలో ట్రాక్టర్ ఇంజిన్‌పై డ్రైవర్ వెనుకవైపు ఉన్న చెక్కపై కూర్చున్న మేకల అంజమ్మ కిందపడగా ట్రాక్టర్ ట్రాలీ టైరు ఆమైపెగా వెళ్లింది. ఈ ప్రమాదంలో అంజమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మృతుని బంధువు వసంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.కిషోర్‌బాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతురాలికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పనికి వెళ్లిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతురాలి కుమారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అధిక వేగమే ప్రమాదానికి కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు.