
భాస్కర్‌రెడ్డి అరెస్టు దుర్మార్గం
● ఎమ్మెల్యే, డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి
దర్శి(కురిచేడు): మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ని అక్రమంగా అరెస్టు చేయటం దుర్మార్గమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా పాలనను గాలికి వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమ అరెస్టులు చేయిస్తూ రాజకీయ కక్ష సాధింపునే పరమావధిగా పెట్టుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వ కుట్రతో అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతోందన్నారు. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుట్రకు తెరతీసిందని చెప్పారు. ఆ కుట్రలో భాగంగా తాజాగా లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని, ఆయన స్నేహితుడిని మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, మరో నలుగురు పై కేసు నమోదు చేసిందన్నారు. ఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ని సిట్ నిందితులుగా చేర్చనేలేదన్నారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును సంఘటితంగా ఎదుర్కొంటామని, ఆయనకు ఏ సంబంధం లేని లిక్కర్ స్కాంలో అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరని, విద్యార్ధి దశ నుంచి ఉద్యమమే ఊపిరిగా పెట్టుకున్న నాయకుడు ఆయన అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏదో రూపంలో జైలుకు పంపాలనే దుర్భుద్ధితో కుట్ర ద్వారా మద్యం అక్రమ కేసులో అక్రమంగా ఇరికించి వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరెస్టు చేయటం అన్యాయం, దురదృష్టకరమని అన్నారు.