యువకుడి ఆత్మహత్యాయత్నం
కంభం: ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పందించి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటన మంగళవారం కంభంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిన కంచు రవి కంభం చెరువుకట్ట సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. సమచారం అందుకున్న ఎస్సై నరసింహారావు ఆ యువకుడిని పోలీసు జీపులో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పోలీసులపై ఆరోపణలు
సెల్ ఫోన్ తాకట్టు విషయంలో ఈనెల 14వ తేదీన రవికుమార్, అతని స్నేహితుడు కంభాల అభిషేక్‌రెడ్డి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. రవికుమార్ తనకు రావాల్సిన రూ.3,200 వెంటనే ఇప్పించాలని కోరగా నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి పంపారు. రవికుమార్ ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలుసుకున్న అతని తండ్రి రంగనాయకులు కంభం ప్రభుత్వ వైద్యశాల వద్దకు వచ్చాడు. ఎస్సై తన కొడుకుని కొట్టాడని, అవతలి వారి వద్ద పోలీసులు డబ్బు తీసుకుని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ వాగ్వివాదానికి దిగాడు. అక్కడికి చేరుకున్న కొందరు గ్రామస్తులు ఆయనకు నచ్చజెప్పారు.
అడ్డుకొని వైద్యశాలకు తరలించిన ఎస్సై
పోలీసులు న్యాయం చేయకపోవడంతోనే
ఆత్మహత్యకు యత్నించాడని బాధితుడి తండ్రి ఆరోపణ


