తోకపల్లి బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
పెద్దారవీడు: మండలంలోని తోకపల్లి గ్రామంలో బస్టాండ్ దగ్గర ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బస్టాండ్ సమీపంలో ఉన్న బంకు వద్ద నిద్రిస్తున్నట్లుగా ఉన్న వ్యక్తి దగ్గరకు స్థానికులు వెళ్లి నిద్రలేపేందుకు ప్రయత్నించారు. అతను చనిపోయినట్లు గమనించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వయసు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు ఉంటాడని, నీలిరంగు ప్యాంటు, పచ్చ, నలుపు గల్ల చొక్కా వేసుకుని ఉన్నట్లు పెద్దారవీడు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్ వివరించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు 9121102186 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
స్కీం వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్
ఒంగోలు టౌన్: మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు స్కీం వర్కర్లందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నారనే సాకుతో స్కీం వర్కర్లు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, ఇంజినీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం అన్యాయమన్నారు. అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్న ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాల్లో కోత పెట్టడం దుర్మార్గమని చెప్పారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఆదాయ పరిమితి పెంచాలన్నారు. గత ఆరేళ్ల ఆదాయ పరిమితిని నేటికీ కొనసాగించడం సమంజసం కాదన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక నష్టపోతున్నారని చెప్పారు. ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా రెగ్యులర్ కాని ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని, కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి వీలు కల్పిస్తూ పని గంటలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన భద్రత కల్పించకుండా మహిళలచే నైట్ షిఫ్ట్ పనులు చేయించడం కార్మికుల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రమేష్ మాట్లాడుతూ స్కీం కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులను చేయడం దారుణమన్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు జీవీ కొండారెడ్డి, పి.కల్పన, జీ శ్రీనివాసరావు, టి.రంగారావు, పి.ఆంజనేయులు, ఆవులయ్య, పారా శ్రీనివాసులు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తోకపల్లి బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం


