పాలనలో కూటమి విఫలం
ఒంగోలు సిటీ: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు పేర్కొన్నారు. సోమవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. గడిచిన ఏదాది కాలంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వ కుటిల నీతిని అవలంబిస్తోందని విమర్శించారు. ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలే భక్షిస్తున్న తీరు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అమాయక ప్రజలపై భౌతిక దాడులు, మహిళలపై రోజూ జరుగుతున్న అఘాయిత్యాలు, చట్టాన్ని పాలకులు తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. వైఎస్సార్ సీపీ మీద, తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబం మీద నిత్యం విషం చిమ్ముతున్న కూటమి నాయకులు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని నిప్పులు చెరిగారు.
టీవీ చర్చలో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తి ఏదో మాట్లాడారని శ్రీనివాసరావుపై కేసు పెట్టి అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు నిదర్శమన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలో పనిచేయడమే నేరమైనట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చర్చలో అనుచితంగా మాట్లాడిన జర్నలిస్టును కొమ్మినేని శ్రీనివాసరావు వారించారని, సదరు జర్నలిస్టు సైతం పొరపాటు జరిగిందని క్షమాపణ కోరారని గుర్తుచేశారు. అయినప్పటికీ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి మీడియా గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం భావించడం అవివేకమన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని కూటమి పాలనను ప్రజలు నిర్ధ్వందంగా తిరస్కరిస్తున్నారని ఇటీవల కొన్ని సర్వేల్లో వెల్లడైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయం మీద రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని, వారి దృష్టిని మరల్చేందుకే అరెస్ట్ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వెన్నుపోటు దినం ర్యాలీలు విజయవంతం కావడంతో కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోందన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ప్రభుత్వం ఎన్ని గారడీలు చేసినా ప్రజల్లో క్రేజ్ రాదన్నారు. పొగాకు రైతుల సమస్యలు తెలుసుకుని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసేందుకు 11వ తేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలికి వస్తున్నారన్నారు. రైతులందరూ హాజరై జగనన్న పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మద్దిపాడు మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, కందుల డానియేల్, వైఎస్సార్ సీపీ నాయకులు పోలినేని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


