రైతుల సమస్యలపై పోరుబాట
సింగరాయకొండ: గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు ఈ నెల 11న పొదిలి రానున్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులెవ్వరూ ఆనందంగా లేరన్నారు. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యంగా పొగాకు, మిరప, కంది, వరి పండించిన రైతులు నష్టాల పాలై అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ నిర్ణయాలతో పొగాకు గరిష్టంగా రూ.360 పలికితే నేడు కూటమి ప్రభుత్వంలో రూ.200 పలకడం కూడా గగనంగా ఉందని మండిపడ్డారు. దిగజారిన ధరలతో అప్పులపాలైన రైతుకు ఆత్మహత్యలే శరణ్యమని, కొండపి మండలం నెన్నూరుపాడు గ్రామానికి చెందిన చల్లా మధుసూదనరెడ్డి ఆత్మహత్యే ఇందుకు ఉదాహరణ అని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు న్యాయం చేస్తున్నట్లు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారే గానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశంలో మంత్రి స్వామి వ్యాపారులకు అండగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ అవసరంలేదని, విదేశీ ఆర్డర్లు రాలేదని చెబుతున్నారే తప్ప రైతుల పక్షాన మాట్లాడలేదని మండిపడ్డారు. ప్రతి రోజూ వేలం కేంద్రంలో వందల బేళ్లు తిరస్కరణకు గురవుతున్నా కూటమి నేతల్లో చలనం లేదన్నారు. రైతుల కష్టాలపై జగనన్న పొదిలి వేలం కేంద్రం సాక్షిగా సమర శంఖారావం పూరించే సమయం ఆసన్నమైందని, మనమంతా జగనన్నకు మద్దతుగా భారీగా తరలివెళ్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పొగాకు రైతులతో జగనన్న ముఖాముఖి నిర్వహిస్తారని, వీరిలో మర్రిపూడి రైతులు ఉంటారని తెలిపారు. కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు, పిన్నిక శ్రీనివాసులు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, దిద్దుగుంట మల్లికార్జునరెడ్డి, పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఢాకా పిచ్చిరెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పొగాకు రైతులకు అండగా జగనన్న
జగనన్న పొదిలి పర్యటనను విజయవంతం చేద్దాం
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్


