
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
నాగులుప్పలపాడు:
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. గురువారం ఉదయం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించారు. పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ట్రాకింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఎన్టీఆర్ వైద్య సేవల కౌంటర్ను, రోగుల రిజిస్ట్రేషన్ గదిని సందర్శించి రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ను, క్యాజువాలిటీ గదులు, అత్యవసర సేవా విభాగం, ల్యాబ్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ ఒనారియల్ ఉన్నారు.
అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు
ఒంగోలు సబర్బన్:
‘మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం’ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై రూపొందించిన క్యూ ఆర్ కోడ్ సేవలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 ప్రభుత్వ సేవలను మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ సేవలు సాంకేతికంగా సురక్షితంగా ఉంటాయని, ప్రజల గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసిందని కలెక్టర్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు, రెండో విడతలో 360 రకాల సేవలను వాట్సాప్‌లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా వివిధ సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇందుకోసం 9552300009 మొబైల్ నంబర్‌ను వాట్సాప్ ద్వారా వినియోగించుకోవచ్చని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకట నాయుడు, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ శ్రీహరి, సీపీఓ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి