
అదే బరితెగింపు..
వైఎస్సార్ సీపీ జెండా తొలగింపు..
కొనకనమిట్ల: కూటమి నేతలు మళ్లీ బరితెగించారు. వైఎస్సార్ సీపీ జెండా తమ ముందు రెపరెపలాడటాన్ని జీర్ణించుకోలేక అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టి కళ్ల మంట తీర్చుకున్నారు. కొనకనమిట్ల మండలం వెలిగండ్ల గ్రామంలో వరుస ఘటనలు అధికారుల తీరును ఛీకొట్టేలా చేశాయి. వివరాల్లోకి వెళ్లే.. వెలిగండ్ల గ్రామంలో రెండేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ జెండా ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డిపై ఆధిపత్యం ప్రదర్శించే ధోరణితో ఉన్న టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుట్రలకు తెరలేపారు. ఈ నెల 7వ తేదీన సర్పంచ్ వెంకటరెడ్డిని స్టేషన్‌కు రప్పించి.. గ్రామానికి వెళ్లిన పోలీసులు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు వైఎస్సార్ సీపీ జెండా తొలగించారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ శ్రేణులు ఏమాత్రం సంయమనం కోల్పోలేదు. జెండా తొలగింపు విషయాన్ని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 12వ తేదీన వెలిగండ్ల గ్రామంలో రెండు చోట్ల వైఎస్సార్ సీపీ జెండాలు ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యేలు అన్నా, ఉడుముల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఎస్సీ కాలనీ వాసులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనడం టీడీపీ నాయకులకు కంటగింపుగా మారింది. కూటమి పాలనలో అధికార దుర్వినియోగాన్ని, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అరాచకాలకు పాల్పడుతున్న తీరును వైఎస్సార్ సీపీ నేతలు ఎండగట్టడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత సహకారంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి బుధవారం సాయంత్రం మరోమారు దురాగతానికి ఒడిగట్టారు. పోలీసుల పహరా నడుమ తహసీల్దార్, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఆర్‌ఐ, గ్రామ సచివాలయ ఉద్యోగులు దగ్గరుండి మరీ జేసీబీతో వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను పెకిలించారు.
అధికారమా.. అహంకారమా?
సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డి తమ స్థలంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను పెకలించేందుకు అధికారులు, పోలీసులు అత్యుత్సాహం చూపడంపై స్థానిక మహిళలు దుమ్మెత్తిపోశారు. టీడీపీ నాయకులు ఆదేశించగానే విచక్షణ మరిచి అధికారులు ప్రవర్తించిన తీరుపై నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారుల తీరును పార్టీ జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. సర్పంచ్ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సిన పంచాయతీ కార్యదర్శి.. జెండా తొలగించాలంటూ సర్పంచ్‌కే నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
కొనకనమిట్ల మండలం వెలిగండ్లలో వైఎస్సార్ సీపీ జెండా తొలగింపు టీడీపీ నాయకులతో చేతులు కలిపిన అధికార యంత్రాంగం ప్రైవేట్ స్థలంలో జెండాను జేసీబీతో పెకలించడంపై పార్టీ శ్రేణుల ఆగ్రహం