
ఆహ్వానం మన్నించండి.. పెళ్లి చేసుకోండి..!
గిద్దలూరు రూరల్: జీవితంలో ఓ మధురమైన ఘట్టం కల్యాణం. సంతోషంగా పెళ్లి చేసుకోవాలని భావించే పేద, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ గిద్దలూరు పట్టణంలో టీటీడీ నిర్మించిన కల్యాణ మండపం నిరుపయోగంగా మారింది. కల్యాణ ఘడియలు సమీపించిన వధూవరుల రాక కోసం ఎదురు చూస్తోంది.! వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరు కోర్టు భవనం సమీపంలో సుమారు ఎకరా విస్తీర్ణంలో టీడీడీ కల్యాణ మండపం నిర్మించింది. 2018లో ప్రారంభించిన ఈ మండపంలో వధువు, వరుడు ఉండేందుకు ప్రత్యేక గదులు, ప్రహరీ, వంటశాల, మరుగుదొడ్లు, సీసీ రోడ్డు, భోజనశాల తదితర సౌకర్యాలన్నీ కల్పించారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ పెళ్లి చేసుకునేవారే కరువయ్యారు. గడిచిన ఏడేళ్లలో కనీసం ఏడు వివాహాలు కూడా ఇక్కడ జరగలేదంటే పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కల్యాణ మంత్రాలు, మంగళవాయిద్యాలు వినిపించని కల్యాణ మండపంగా పేరు తెచ్చుకుంది. మండపం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సైతం నిర్వహణలో చేతులెత్తేయడంతో శిథిలావస్థకు చేరుకుంటోంది. మండపం ఆవరణతోపాటు ప్రధాన రహదారికి ఇరువైపులా చిల్లచెట్లు పెరిగాయి. గోడలు నెర్రెలిచ్చాయి. కొందరు ఆకతాయిలు మండపం కిటికీల అద్దాలను రాళ్లతో పగలగొట్టారు. అరకొర వసతులు ఉన్న ప్రైవేట్ కల్యాణ మండపాల్లో ప్రతి సీజన్‌లో పదుల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతుంటే.. అన్ని వసతులు ఉన్న టీటీడీ మండపంలో బాజాభజంత్రీలు ఎందుకు మోగడం లేదో ఆ వెంకన్నకే ఎరుక.
కారణం ఇదేనా?
గిద్దలూరులోని కొందరు కల్యాణ మండపాల నిర్వాహకులు తమకు అయినవారిని ముందుపెట్టి టీటీడీ మండపం నిర్వహణ టెండర్ దక్కించుకుని అక్కడ వివాహాలు కాకుండా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్యాణ మండపం పట్టణానికి దూరంగా ఉండటం వల్ల వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ కాంట్రాక్టర్ టీటీడీ మండపం టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాదైనా వివాహాలు జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.
ఆదరణకు నోచుకోని గిద్దలూరు టీటీడీ కల్యాణ మండపం
వినిపించని కల్యాణ మంత్రాలు.. మోగని బాజాలు
ప్రారంభించి ఏడేళ్లు.. జరిగింది రెండే పెళ్లిళ్లు!