
ఆరు నెలల పసికందు కిడ్నాప్!
ఒంగోలు టౌన్: తలిదండ్రులు గాఢ నిద్రలో ఉండగా వారి పక్కలోనే హాయిగా కునుకుతీస్తున్న పసికందును కిడ్నాప్ చేసిందో మహిళ. పోలీసుల కథనం ప్రకారం.. కొండపి గ్రామానికి చెందిన గుర్నాథం అంజయ్య, అంజమ్మ దంపతులు ఊరూరూ తిరుగుతూ తల వెంట్రుకలు కొనుక్కోవడం, అమ్మడం చేస్తుంటారు. ఈ క్రమంలో కొంతకాలంగా ఆ దంపతులు త్రోవగుంటలో నివసిస్తున్నారు. వారికి ఆరు నెలల పాప ఉంది. సోమవారం రాత్రి ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఆ దంపతులు పాపతో కలిసి నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేవగానే పక్కలో ఉన్న పాప కనిపించలేదు. దాంతో ఆందోళనకు గురైన ఆ దంపతులు డిపో పరిసరాల్లో వెదికారు. పాప జాడ లేకపోవడంతో డిపోలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు.పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి మద్దిపాడుకు చెందిన ఇట్లా ప్రియాంకను నిందితురాలిగా గుర్తించారు. ఆమె కోసం గాలించగా జీజీహెచ్ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో హుటాహుటిన వెళ్లి పాపను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి విధుల్లో ఉన్న దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, వన్‌టౌన్ సీఐ నాగరాజు చేతులమీదుగా పాపను తలిదండ్రులకు అప్పగించారు. టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. కిడ్నాప్ అయిన పాపను రెండు గంటల వ్యవధిలోనే అప్పగించడంతో పోలీసులకు తలిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
రెండు గంటల్లోనే నిందితురాలి పట్టివేత
తెల్లవారుజామున ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఘటన